SRH vs GT : ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. గుజరాత్ టైటాన్స్ (GT) బౌలర్లు నిప్పులు చెరిగే బంతులతో విరుచుకుపడటంతో సన్‌రైజర్స్ కేవలం 86 పరుగులకే కుప్పకూలింది. ఈ అద్భుత విజయంతో గుజరాత్ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకోవడమే కాకుండా, వరుసగా ఐదో విజయాన్ని నమోదు చేసింది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ (61) , వాషింగ్టన్ సుందర్ (50) అర్ధ శతకాలతో రాణించి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించారు. నిశాంత్ సింధు 22 పరుగులు జోడించారు. సన్‌రైజర్స్ బౌలర్లలో సాకిబ్ హుస్సేన్ , ప్రఫుల్ హింగే తలో రెండు వికెట్లు తీయగా, కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఒక వికెట్ సాధించారు.
169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. రబడా తన పదునైన బంతులతో టాప్ ఆర్డర్‌ను దెబ్బతీశాడు. ఇషాన్ కిషన్ (11), హెన్రిచ్ క్లాసెన్ (14) తక్కువ పరుగులకే వెనుదిరగడంతో హైదరాబాద్ పీకల్లోతు కష్టాల్లో పడింది. కెప్టెన్ కమిన్స్ (19) కాసేపు పోరాడినా, అది జట్టును గట్టెక్కించలేకపోయింది. ప్రసిద్ధ్ కృష్ణ , హోల్డర్ల ధాటికి మిడిల్ ఆర్డర్ పేకమేడలా కూలిపోయింది. చివరగా రషీద్ ఖాన్ మాయాజాలంతో ప్రఫుల్ హింగేను స్టంపౌట్ చేయడంతో 14.5 ఓవర్లలో 86 పరుగులకే సన్‌రైజర్స్ ఇన్నింగ్స్ ముగిసింది.
గుజరాత్ బౌలర్లలో కాగిసో రబడా 4 ఓవర్లలో 28 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టి ఇన్నింగ్స్ ఆరంభంలోనే సన్‌రైజర్స్‌ను దెబ్బతీశాడు. జేసన్ హోల్డర్ కూడా 4 ఓవర్లలో కేవలం 20 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ప్రసిద్ధ్ కృష్ణ 3 ఓవర్లలో 23 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీయగా, రషీద్ ఖాన్ , సిరాజ్ చెరో వికెట్ సాధించారు. బ్యాటింగ్ , బౌలింగ్ విభాగాల్లో సమిష్టిగా రాణించిన గుజరాత్ టైటాన్స్ ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది.
