Site icon NTV Telugu

SRH Team 2026: మాన్‌స్టర్ వచ్చేశాడు.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ రాత మారేనా?

SRH Team 2026

SRH Team 2026

అబుదాబి వేదికగా మంగళవారం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 మినీ వేలం జరిగింది. 10 ఫ్రాంచైజీలు తమకు కావాల్సిన ఆటగాళ్లను తీసుకుని.. ఐపీఎల్ 2026 కోసం పూర్తిస్థాయి జట్లను సిద్ధం చేసుకున్నాయి. తెలుగు జట్టు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌) 9 మంది ప్లేయర్స్‌ను వేలంలో తీసుకుంది. ఈ తొమ్మిది మందిలో బాగా తెల్సిన ప్లేయర్స్ ఇద్దరంటే ఇద్దరే ఉన్నారు. ఆ ఇద్దరిలో ఓ మాన్‌స్టర్ ఉన్నాడు. అతడే ఇంగ్లండ్ హార్డ్ హిట్టర్ ‘లియామ్‌ లివింగ్‌స్టోన్‌’. మినీ వేలంలో రూ.13 కోట్లకు ఎస్‌ఆర్‌హెచ్‌ అతడిని దక్కించుకుంది.

ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్ ఆట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్కసారి క్రీజులో కుదురుకున్నాడంటే.. పరుగుల వరద పారిస్తాడు. ఫోర్లు, సిక్సర్లతో స్టేడియంను హోరెత్తిస్తాడు. ఒంటిచేత్తో ఎన్నో మ్యాచ్‌లను గెలిపించాడు. బ్యాటింగే కాదు.. బౌలింగ్‌లో కూడా లివింగ్‌స్టోన్ రాణించిన సందర్భాలు ఉన్నాయి. తన ఆల్‌రౌండ్ నైపుణ్యంతో ఇంగ్లండ్ జట్టుకు అతడు ఎన్నో విజయాలు అందించాడు. వేలం జరిగిన రోజే లివింగ్‌స్టోన్ రెచ్చిపోయాడు. ఇంటర్నేషనల్ లీగ్ టీ20లో అబుదాబి నైట్ రైడర్స్ తరఫున ఆడుతున్న లివింగ్‌స్టోన్ 48 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 76 పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు. డిజర్ట్ వైపర్స్ జట్టుతో జరిగిన ఈ మ్యాచ్‌లో నైట్ రైడర్స్ విజయం సాధించింది. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌’గా లివింగ్‌స్టోన్ నిలిచాడు.

ఎస్‌ఆర్‌హెచ్‌ జట్టులో ఇప్పటికే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ లాంటి హిట్టర్లు ఉన్నారు. అయితే గతేడాది అందరూ విఫలమవడంతో ఎస్‌ఆర్‌హెచ్‌ ప్లే ఆఫ్స్ చేరలేదు. చాలా మ్యాచ్‌లలో మిడిల్ ఆర్డర్ వైఫల్యం కారణంగా ఎస్‌ఆర్‌హెచ్‌ ఓటములను ఎదుర్కొంది. వచ్చే సీజన్‌కు మాన్‌స్టర్ లియామ్ లివింగ్‌స్టోన్ అందుబాటులో ఉండనున్నాడు. మిడిల్ ఆర్డర్‌లో జట్టును అతడు ఆదుకోనున్నాడు. బ్యాటింగ్, బౌలింగ్‌లో లివింగ్‌స్టోన్ జట్టుకు ఉపయోగపడుతాడని ఎస్‌ఆర్‌హెచ్‌ ఫాన్స్ నమ్మకంగా ఉన్నారు. మాన్‌స్టర్ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ రాత మారుస్తాడేమో చూడాలి.

మినీ వేలంలో తీసుకున్న ప్లేయర్స్:
లియామ్ లివింగ్‌స్టోన్ (రూ.13 కోట్లు)
సలీల్ అరోరా (రూ.1.5 కోట్లు)
శివంగ్ కుమార్ (రూ.30 లక్షలు)
సాకిబ్ హుస్సేన్ (రూ.30 లక్షలు)
ఓంకార్ తర్మలే (రూ.30 లక్షలు)
అమిత్ కుమార్ (రూ.30 లక్షలు)
ప్రఫులే హింగే (రూ.30 లక్షలు)
క్రెయిన్స్ (రూ.30 లక్షలు)
శివమ్ మావి (రూ.75 లక్షలు)

రిటెన్షన్‌ ప్లేయర్లు:
అభిషేక్ శర్మ
అనికేత్ వర్మ
బ్రైడన్ కార్స్
ఎషాన్ మలింగ
హర్ష్ దూబె
హర్షల్ పటేల్
హెన్రిచ్ క్లాసెన్
ఇషాన్ కిషన్
జయ్‌దేవ్ ఉనద్కత్
కమిందు మెండిస్
నితీశ్ కుమార్ రెడ్డి
పాట్ కమిన్స్
స్మరన్ రవిచంద్రన్
ట్రావిస్ హెడ్
జిషన్ అన్సారీ

Exit mobile version