పీవీ సింధూ… సైనా నెహ్వాల్… ఆటలో ఇద్దరూ ఇద్దరే. బ్యాడ్మింటన్‌లో భారత కీర్తిపతాకాన్ని ప్రపంచస్థాయిలో రెపరెపలాడించినవారే. కాకపోతే, సైనా సీనియర్.. పీవీ సింధూ కాస్త జూనియర్. అయితే, వీళ్లిద్దరి మధ్యా అగాథం ఏర్పడిందా? ఇద్దరూ మాట్లాడుకోవడం లేదా? టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం గెలించిన పీవీ సింధుకు.. మాజీ కోచ్ గోపీచంద్ సహా ఎంతోమంది ప్రముఖులు అభినందనలు తెలిపారు. మరి సైనా నెహ్వాల్ ఎందుకు.. సింధూని విష్ చేయలేదు. ఇప్పుడు భారత క్రీడాభిమానులు ఇదే విషయంపై చర్చించుకుంటున్నారు. ఈ అంశంపై మీడియా ప్రశ్నకు సింధూ ఇచ్చిన సమాధానం కూడా చర్చనీయాంశంగా మారింది.
ఒలింపిక్స్‌లో వరుసగా రెండోసారి పతకం సాధించి చరిత్ర సృష్టించిన భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధుపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. తన తొలి గురువు, జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ నుంచి కూడా అభినందనలు వచ్చినట్టు చెప్పింది సింధూ. అయితే, తన సీనియర్ సైనా నెహ్వాల్ నుంచి ఎలాంటి సందేశం రాలేదని చెప్పింది. అంతేకాదు, తామిద్దరం ఎక్కువగా మాట్లాడుకోమనీ చెప్పింది సింధూ. దీంతో, వీళ్లిద్దరి మధ్య సరైన సంబంధాలు లేవన్న చర్చ మరోసారి తెరమీదకు వచ్చింది.
జాతీయ స్థాయిలో ఎన్నో మ్యాచ్‌లు హోరాహోరీ తలపడ్డారు సింధూ, సైనా నెహ్వాల్. కొన్నిసార్లు సింధూది విజయమైతే.. మరికొన్ని సార్లు సైనా నెహ్వాల్‌ను విజయం వరించింది. అయితే, ప్రపంచ వేదికలపై మాత్రం.. ఇద్దరూ వేర్వేరుగా దేశ పతాకాన్ని ఎగరేశారు. సైనా, సింధూ.. ఇద్దరూ పుల్లెల గోపిచంద్ దగ్గర శిష్యరికం చేసినవారే. ఇద్దరూ అతని అకాడమీలోనే బ్యాడ్మింటన్‌లో మెలకువలు నేర్చుకున్నారు. దేశం గర్వించే స్థాయికి ఎదిగారు. అయితే, సింధూ కన్నా సైనా కొన్నేళ్లు ముందుగానే ఫీల్డ్‌లోకి వచ్చింది. సింధూ కోర్టులోకి అడుగుపెట్టే నాటికే.. ఎన్నో పతకాలు సాధించింది. మరెన్నో టౌర్నమెంట్లు గెలిచింది. ఆ తర్వాత సైనాతోపాటే.. సింధూ కూడా తన గేమ్‌తో ఫేమస్సయ్యింది. వీళ్లిద్దరి మధ్య.. చాలా మ్యాచ్‌లూ జరిగాయి. ఒకే దగ్గర కోచింగ్ తీసుకున్నా… ఒకే గేమ్ ఆడుతున్నా… ఒకే దేశానికి ప్రాతినిథ్యం వహిస్తున్నా… సింధూ, సైనాల మధ్య సంబంధాలు అంతంత మాత్రమేనన్న ప్రచారం ఉంది. ఇద్దరి మధ్యా మాటలు కూడా సరిగ్గా ఉండవని స్పోర్ట్స్ సర్కిల్‌లో చెబుతుంటారు. ఈ విషయం తాజాగా, సింధూ మాటల్లో స్పష్టమైంది. మొదట్లో తన దగ్గర కోచింగ్ తీసుకుని.. ఆ తర్వాత వేరే గురువును ఎంపిక చేసుకుని… టోక్యో ఒలింపిక్స్‌లోమెడల్ సాధించిన సింధూకు.. పుల్లెల గోపీచంద్ అభినందలు తెలిపారు. ఆమె ప్రతిభను కొనియాడారు. సహక్రీడాకారిణి సైనా నెహ్వాల్ మాత్రం.. సింధూ విక్టరీపై స్పందించకపోవడం… వారి మధ్య విభేదాలకు అద్దం పడుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఈ సారి ఒలింపిక్స్‌కు అర్హత సాధించడంలో సైనా విఫలమైంది. కరోనా పరిస్థితులే ఆమె అవకాశాలను దెబ్బతీశాయని చెప్పొచ్చు. విశ్వక్రీడల సంగ్రామానికి అర్హత సాధించేందుకు ఉపకరించే.. చాలా టౌర్నమెంట్లలో లాక్‌డౌన్ కారణంగా ఆడలేకపోయింది సైనా. జూన్ 1 నుంచి 6 వరకు జరగాల్సిన సింగపూర్ ఓపెన్ సూపర్500 టోర్నీ కూడా రద్దయ్యింది. టోక్యో ఒలింపిక్స్ అర్హత టోర్నీలలో భాగమైన ఇండియా ఓపెన్, మలేసియా ఓపెన్‌ను కరోనా కారణంగానే వాయిదా వేశారు. సింగపూర్ ఓపెన్‌ను ఏకంగా రద్దు చేశారు.దీంతో, టోక్యో ఒలింపిక్స్ బెర్త్ ఖరారు చేసుకోవాలన్న భారత స్టార్స్ సైనా, శ్రీకాంత్‌లకు నిరాశ ఎదురైంది.
టోక్యో ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ నిబంధనల ప్రకారం సింగిల్స్‌లో ఒకే దేశం నుంచి ఇద్దరు అర్హత పొందాలంటే టాప్16లో కచ్చితంగా ఉండాలి. ‘టోక్యో’ క్వాలిఫయింగ్ ర్యాంకింగ్స్‌లో మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు ఏడో ర్యాంక్‌లో… సైనా 22వ ర్యాంక్‌లో నిలిచారు. దీంతో, సింధుకు ‘టోక్యో’ ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశం దక్కింది. 31 ఏళ్ల సైనా నెహ్వాల్ 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో క్వార్టర్ ఫైనల్ చేరగా… 2012 లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని సాధించింది. 2016 రియో ఒలింపిక్స్‌లో లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టింది.
గోపీ సర్ తనను అభినందిస్తూ మెసేజ్ చేశారనీ… అయితే, తాను సోషల్ మీడియాను ఇంకా చూడలేదనీ చెప్పింది సింధు. నెమ్మదిగా ప్రతి ఒక్కరికీ సమాధానమిస్తున్నాని చెప్పింది. అయితే, సైనా నుంచి మాత్రం ఎలాంటి సందేశం రాలేదని చెప్పింది సింధూ. తామిద్దరం ఎక్కువగా మాట్లాడుకోమని వెల్లడించింది.
గతంలో ఒకే ఇంటర్వ్యూలో పాల్గొన్న సింధూ, సైనా.. తమ రిలేషన్‌పై బహిరంగంగానే క్లారిటీ ఇచ్చారు. తమది ఇండివీజివల్ గేమ్ అని.. అల్టిమేట్‌గా విజయమే లక్ష్యమనీ చెప్పుకొచ్చారు. అందుకే, కొన్నిసార్లు మాట్లాడుకొంటాం.. మరికొన్ని మాట్లాడుకోం.. అంటూ కుండ బద్ధలు కొట్టారు. తమ ఇద్దరి మధ్యే కాదు.. బ్యాడ్మింటన్ ప్లేయర్స్ అంతా.. ఇలాంటి రిలేషన్‌నే కొనసాగిస్తారనీ చెప్పారు. దీంట్లో అపార్ధం చేసుకోవాల్సిందేమీ లేదని కూడా స్పష్టత నిచ్చారు.
తన దగ్గర కోచింగ్ తీసుకోవడం మానేసిన సింధుపై.. గోపీచంద్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. బ్యాడ్మింటన్‌లో పీవీ సింధు ఈసారి కూడా కచ్చితంగా మెడల్ గెలుచుకుంటుందని.. ఇటీవల చెప్పారు గోపీచంద్. సింధూపై అదే విశ్వాసాన్ని కనబరిచారు గోపీ. అందుకు తగ్గట్టే రాణించిన సింధూ.. మరో ఒలింపిక్ పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది.
బ్యాడ్మింటన్‌లో రియో, లండన్ ఒలింపిక్స్‌లలో కంటే ఈ సారి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ముందే చెప్పారు గోపీచంద్. సింధు కచ్చితంగా పతకం సాధిస్తుందనడంలో సందేహం లేదని చెప్పారు. ఈసారి స్వర్ణం సాధిస్తుందని కూడా విశ్వాసం వ్యక్తం చేశారు గోపీ. అయితే, అనూహ్యంగా సెమీస్‌లో ఓడిన సైనా.. కాంస్యంతో సరిపెట్టుకుంది. అయినా, ఆమె ప్రతిభను అభినందిస్తూ.. శుభాకాంక్షలు తెలిపారు గోపీచందర్. తమ మధ్య గురుశిష్య అనుబంధం చెరిగిపోలేదనీ.. చాటి చెప్పారు.