NTV Telugu Site icon

South Africa: దురదృష్టం అంటే ఇదే.. ఖాయం అనుకున్న సెమీస్ బెర్త్ చేజారింది

South Africa

South Africa

South Africa: క్రికెట్‌లో దురదృష్టం వెంటాడే జట్టు ఏదైనా ఉందంటే అది దక్షిణాఫ్రికా మాత్రమే. ప్రస్తుత టీ20 ప్రపంచకప్‌లో అందరికంటే ముందు సెమీస్ చేరుతుందని భావించిన జట్టు దక్షిణాఫ్రికా. కానీ అనూహ్యంగా దక్షిణాఫ్రికా సెమీస్ రేసు నుంచి వైదొలిగింది. బంగ్లాదేశ్‌పై భారీ విజయం, టీమిండియా అద్భుత గెలుపు చూసి దక్షిణాఫ్రికా సెమీస్‌కు వెళ్లడం లాంఛనమే అని అందరూ భావించారు. కానీ టోర్నీ ప్రారంభం, టోర్నీ ముగింపు ఆ జట్టు దురదృష్టాన్ని మరోసారి చాటిచెప్పాయి. సూపర్-12లో దక్షిణాఫ్రికా తన తొలి మ్యాచ్‌ను జింబాబ్వేతో ఆడింది. ఈ మ్యాచ్‌లో సఫారీలు గెలవాల్సింది. 7 ఓవర్లలో 64 పరుగులు చేస్తే గెలుపు ఆ జట్టు సొంతం అవుతుంది. కానీ మూడు ఓవర్లలోనే 51 పరుగులు చేసింది. కానీ వర్షం కారణంగా అనూహ్య స్థితిలో మ్యాచ్ రద్దు అయ్యింది. దీంతో జింబాబ్వే, దక్షిణాఫ్రికా చెరో పాయింట్ పంచుకున్నాయి.

Read Also: IND Vs ZIM: రాహుల్ క్లాస్.. సూర్యకుమార్ మాస్.. టీమిండియా భారీ స్కోరు

ఆ ఫలితం తర్వాత రెండు అద్భుత విజయాలతో సెమీస్ రేసులోకి దూసుకువెళ్లిన దక్షిణాఫ్రికా ఉన్నట్టుండి వరుసగా పాకిస్థాన్, నెదర్లాండ్స్ చేతుల్లో ఓడిపోయింది. దీంతో జింబాబ్వే మ్యాచ్ ఫలితం కారణంగా టోర్నీ నుంచి దక్షిణాఫ్రికా బయటకు వెళ్లిపోయింది. దక్షిణాఫ్రికా ఈ టోర్నమెంట్ నుంచి వైదొలగడంతో దాని స్థానంలో అనుకోని విధంగా పాకిస్తాన్ సెమీ ఫైనల్స్‌కు చేరింది. నెదర్లాండ్స్ చేతిలో దారుణంగా ఓడిపోవడం వల్ల సెమీస్ చేరే అవకాశాలను బంగారు పళ్లెంలో పెట్టి పాకిస్తాన్‌కు అప్పగించింది. ముఖ్యంగా ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్ అద్భుత ప్రదర్శన చేసింది. తనకంటే ఎంతో బలమైన దక్షిణాఫ్రికాకు చుక్కలు చూపించింది. ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాపించింది. తొలుత బ్యాటింగ్‌లో ఆ తరువాత బౌలింగ్‌లో నెదర్లాండ్స్ ఆటగాళ్లు చూపించిన తెగువ, దూకుడు ముందు దక్షిణాఫ్రికా వెలవెలబోయింది.