Site icon NTV Telugu

Sourav Ganguly: ఒక్క రోజులోనే ఎవ్వరూ అంబానీ, మోడీ కాలేరు.. గంగూలీ సంచలన వ్యాఖ్యలు

Sourav Ganguly

Sourav Ganguly

Sourav Ganguly Sensational Comments on BCCI President Post: బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి సౌరవ్ గంగూలీ దిగిపోవడం దాదాపు ఖాయమైపోయింది. రెండోసారి ఆ పదవిని చేపట్టే అవకాశాలు ఉన్నా, ఆయన తప్పుకుంటున్నాడు. ఈ పదవికి రోజర్ బిన్నీ ఒక్కడే నామినేషన్ దాఖలు కాబట్టి.. ఆయనే ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశాలున్నాయి. అక్టోబర్‌ 18న ఆయన బీసీసీఐ అధ్యక్ష పదవి బాధ్యతలు స్వీకరిస్తాడని ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా సైతం వెల్లడించారు. ఈ క్రమంలో సౌరభ్ గంగూలీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఒక్క రోజులోనే ఏ ఒక్కరూ అంబానీ, మోడీ కాలేరంటూ అతడు చేసిన వ్యాఖ్యలు.. హాట్ టాపిక్‌గా నిలిచాయి.

‘‘ఇప్పటి వరకు నేను చాలా మంచి రోజులు ఆస్వాదించాను. భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించడంతో పాటు బీసీసీఐ అధ్యక్షుడిగా చేశాను. ఇంకా గొప్ప పనులు చేసేందుకు కూడా సిద్ధమవుతున్నా. మీరు ఎప్పటికీ ఆటగాడిగా.. పాలకుడిగానూ ఉండలేరు. నేను మాత్రం ఈ రెండింటినీ చేశాను. అయితే.. ఒక్క రోజులోనే ఎవ్వరూ అంబానీ లేదా నరేంద్ర మోడీ కాలేరు. ఎన్నో సంవత్సరాలు కష్టపడితే గానీ ఆ స్థాయికి చేరుకోలేరు’’ అంటూ దాదా చెప్పుకొచ్చాడు. అలాగే తన కెప్టెన్సీపై స్పందిస్తూ.. తాను చేసిన పరుగులనే కాకుండా ఇతర విషయాలను సైతం అభిమానులు గుర్తు పెట్టుకున్నారన్నాడు. నాయకుడిగా జట్టును తాను నడిపించిన తీరు వారిని ఆకట్టుకుందని, ఇప్పటికీ అభిమానులు దాని గురించి ప్రస్తావించుకోవడం తనకు ఆనందాన్ని కలిగిస్తుందన్నాడు.

కాగా.. భారత క్రికెట్ జట్టుకు నాయకత్వం వహించిన గంగూలీ, ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత పశ్చిమ బంగాల్‌ క్రికెట్ అసోషియేషన్‌ అధ్యక్షుడిగా కొన్నాళ్లు పని చేశాడు. ఆ తర్వాత.. భారత క్రికెట్‌ బోర్డుకు ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టాడు. రెండోసారి కూడా ఈ బాధ్యతలు స్వీకరిస్తాడని అంతా అనుకున్నారు కానీ, అనూహ్యంగా రోజర్ బిన్నీ అధ్యక్ష పదవి రేసులో వచ్చాడు. ఇప్పుడు గంగూలీ తీసుకోబోయే తదుపరి నిర్ణయం ఏంటి? అనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Exit mobile version