Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!

  • కీలక పోరుకు సిద్ధమైన భారత మహిళల జట్టు
  • ఆస్ట్రేలియాపై హర్మన్ సేన తప్పక గెలవాల్సిందే
  • మ్యాచ్‌కు ముందు స్మృతి మంధాన ఆసక్తికర వ్యాఖ్యలు
  • మా సత్తా ఏంటో ఆస్ట్రేలియాకు చూపిస్తాం
Smriti Mandhana Comments

Smriti Mandhana Comments

Smriti Mandhana Sends Strong Warning to Australia: భారత మహిళల జట్టు కీలక పోరుకు సిద్ధమైంది. మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో సెమీఫైనల్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే ఆస్ట్రేలియాపై హర్మన్ సేన తప్పక గెలవాల్సి ఉంది. ఆదివారం (జూన్ 28) లండన్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌కు ముందు భారత వైస్ కెప్టెన్ స్మృతి మంధాన ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆస్ట్రేలియా అంటే తాము బయపడమని, భారత్ సత్తా ఏంటో చూపిస్తాం అని పేర్కొంది. ఎలాంటి ఒత్తిడి ఉన్నా తాము దూకుడు ఆటనే కొనసాగిస్తామని, ఆస్ట్రేలియాపై కూడా అదే శైలిలో బరిలోకి దిగుతామని మంధాన స్పష్టం చేసింది. ఈ మ్యాచ్ భారత్‌కు ‘డూ ఆర్ డై’ కావడంతో అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.

దూకుడే మా లక్ష్యం:

మ్యాచ్‌కు ముందు మీడియాతో మాట్లాడిన స్మృతి మంధాన.. ఈ టోర్నీలో భారత బ్యాటింగ్ యూనిట్ తమ పూర్తి సామర్థ్యాన్ని ఇంకా ప్రదర్శించలేదని అంగీకరించింది. బ్యాటింగ్ సమావేశాల్లో దూకుడుగా ఆడాలనే అంశంపైనే ఎక్కువగా చర్చిస్తున్నామని తెలిపింది. ‘మొదటి బంతి నుంచే దూకుడుగా ఆడాలని మేమంతా భావిస్తున్నాం. కానీ ఇప్పటివరకు అనుకున్న స్థాయిలో అది సాధ్యపడలేదు. అయితే ప్రతి బ్యాటర్ పెద్ద ఇన్నింగ్స్ ఆడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో మా అసలైన ఆటను చూపించాలనుకుంటున్నాం’ అని మంధాన పేర్కొంది.

ఆస్ట్రేలియాతో గ్యాప్ చాలా తగ్గింది:

గత నాలుగు నుంచి ఐదు సంవత్సరాల్లో భారత మహిళల జట్టు ఆస్ట్రేలియాతో పోటీపడే స్థాయికి చేరుకుందని స్మృతి తెలిపింది. మహిళల ప్రీమియర్ లీగ్, బిగ్ బాష్ లీగ్‌లలో భారత ఆటగాళ్లు ఆడటం వల్ల ఒత్తిడిని ఎదుర్కొనే సామర్థ్యం పెరిగిందని చెప్పింది. ‘ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 సిరీస్‌లో మేము మంచి ప్రదర్శన చేశాం. ఆ అనుభవం మాకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తోంది. గతంతో పోలిస్తే రెండు జట్ల మధ్య అంతరం చాలా తగ్గింది. విదేశీ లీగ్‌ల అనుభవం కూడా మాకు ఎంతో ఉపయోగపడుతోంది’ అని వివరించింది.

మంచి ఆరంభం ఇవ్వాలనుకుంటున్నా:

ఓపెనింగ్ భాగస్వామి షెఫాలీ వర్మతో కలిసి ఈ మ్యాచ్‌లో జట్టుకు బలమైన ఆరంభం అందించాలనే లక్ష్యంతో ఉన్నట్లు మంధాన వెల్లడించింది. ఇంగ్లండ్ సిరీస్‌లో ఇద్దరూ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయామని గుర్తు చేసిన ఆమె.. ఈసారి ఆ లోటును భర్తీ చేయాలని భావిస్తున్నట్లు తెలిపింది. ‘షెఫాలీ ప్రస్తుతం బంతిని అద్భుతంగా టైమ్ చేస్తోంది. మేమిద్దరం కలిసి జట్టుకు బలమైన పునాది వేయగలిగితే మ్యాచ్‌పై పట్టుసాధించడం సులభమవుతుంది’ అని పేర్కొంది.

హేడెన్, సంగక్కర సలహాలు ఎంతో ఉపయోగపడ్డాయి:

ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హేడెన్, శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కరతో ఇటీవల బ్యాటింగ్‌పై చర్చించిన విషయాన్ని కూడా స్మృతి వెల్లడించింది. చిన్నప్పటి నుంచే వారిద్దరి ఆటను చూసి ఎంతో నేర్చుకున్నానని తెలిపింది. ‘హేడెన్ కామెంటరీ చేస్తుండగా కలిసే అవకాశం వచ్చింది. బ్యాటింగ్ గ్రిప్‌తో పాటు కొన్ని సాంకేతిక అంశాలపై చర్చించాను. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌కు ముందు మీతో మాట్లాడుతున్నానంటే మీకు ఇబ్బందిగా లేదా అని సరదాగా అడిగాను. కానీ ఆయన ఎంతో ఆప్యాయంగా పలు విలువైన సూచనలు చేశారు. వాటిని మ్యాచ్‌లో అమలు చేయాలని ఆశిస్తున్నాను’ అని స్మృతి మంధాన చెప్పింది.