Site icon NTV Telugu

T20 World Cup: టీ20లలో చరిత్ర సృష్టించిన జింబాబ్వే ఆటగాడు

Sikinder Raza

Sikinder Raza

T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌పై జింబాబ్వే సంచలన విజయం సాధించింది. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన జింబాబ్వే ఆటగాడు సికిందర్ రజా చరిత్ర సృష్టించాడు. ఒక ఏడాదిలో అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న ఆటగాడిగా నిలిచాడు. సికిందర్ రజా ఈ ఏడాది ఏడు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నాడు. ఈ జాబితాలో టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ రెండో స్థానంలో ఉన్నాడు. 2016లో అంతర్జాతీయ టీ20ల్లో కోహ్లీ ఆరు అవార్డులు సొంతం చేసుకున్నాడు. 2021లో ఉగాండా బౌలర్ దినేష్ నక్రానీ ఆరు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌లను అందుకుని మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. కాగా క్వాలిఫయింగ్ మ్యాచ్‌లతో కలిపి ఈ ఒక్క ప్రపంచకప్‌లోనే సికిందర్ రజాకు మూడు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు కైవసం చేసుకున్నాడు.

Read Also: Suryakumar Yadav: రిజ్వాన్ రికార్డ్ బ్రేక్.. అగ్రస్థానంలోకి సూర్య

కాగా క్రికెట్‌లో ఏ జట్టునూ తక్కువ అంచనా వేయకూడదని ఇవాళ్టి మ్యాచ్ ద్వారా మరోసారి నిరూపితమైంది. బలమైన పేస్ దళం, నెంబర్ 1 బ్యాటర్ రిజ్వాన్, పరుగుల వరద పారించే బాబర్ ఆజమ్ ఉన్న పాకిస్థాన్ జట్టును జింబాబ్వే జట్టు కోలుకోలేని దెబ్బ కొట్టింది. బౌలర్లు సమష్టిగా రాణించడంతో మరపురాని విజయాన్ని అందుకుంది. అంతకుముందు ఐర్లాండ్ జట్టు కూడా ఇంగ్లండ్‌ను మట్టికరిపించింది. ఇప్పటివరకు రెండు సంచలనాలు నమోదైన ఈ ప్రపంచకప్‌లో మెగా టోర్నీ ముగిసేలోపు ఇంకెన్ని సంచలనాలు నమోదవుతాయో చూడాలి.

Exit mobile version