టీమిండియా సీనియర్ బ్యాటర్ రోహిత్ శర్మ భవిష్యత్తుపై ఇంకా స్పష్టత రాలేదు. దాంతో 2027 వన్డే ప్రపంచ కప్‌కు హిట్‌మ్యాన్ జట్టులో ఉంటాడా లేదా అన్న చర్చ కొనసాగుతోంది. ఇప్పటికే టీ20, టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన రోహిత్.. 2027 ప్రపంచ కప్ ఆడాలన్న లక్ష్యంతో ఉన్నట్లు పలుమార్లు సంకేతాలు ఇచ్చాడు. అయితే అప్పటికి హిట్‌మ్యాన్ వయస్సు 40 సంవత్సరాలకు చెరువవుతుంది. అందుకే అతని ఎంపికపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
మహ్మద్ కైఫ్ తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ.. రోహిత్ శర్మను 2027 ప్రపంచ కప్ జట్టులో కొనసాగించాలంటే భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ముందుకొచ్చి తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పాలని సూచించాడు. ‘రోహిత్ విషయంలో ప్రస్తుతం వెయిట్ అండ్ వాచ్ పరిస్థితి. చాలా సందిగ్ధత ఉంది. ఆ సందిగ్ధతకు ముగింపు పలకాలంటే గిల్ మీడియా ముందుకు వచ్చి 2027 ప్రపంచ కప్‌కు రోహిత్ మా జట్టుకు అవసరం అని చెప్పాలి. ఒక కెప్టెన్‌కు జట్టు ఎంపికలో కీలక పాత్ర ఉంటుంది. ఆటగాళ్ల సామర్థ్యం గురించి సెలెక్టర్ల కంటే సహచర ఆటగాళ్లకే ఎక్కువ అవగాహన ఉంటుంది. అందుకే రోహిత్ అవసరాన్ని కోచ్, సెలెక్టర్లకు గిల్ వివరించి వారిని ఒప్పించాలి. అప్పుడే హిట్‌మ్యాన్ ప్రపంచ కప్ ఆడుతాడు’ అని కైఫ్ అభిప్రాయపడ్డాడు.
గతంలో భారత జట్లలో కెప్టెన్లు తమ ఆటగాళ్లకు ఎలా అండగా నిలిచారో కూడా కైఫ్ గుర్తు చేశాడు. ‘వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్ పరుగులు చేయని సమయంలో కూడా సౌరవ్ గంగూలీ వారిని నమ్మాడు. మహేంద్ర సింగ్ ధోనీ కూడా తన ఆటగాళ్లకు ఎప్పుడూ మద్దతుగా నిలిచాడు. రోహిత్ శర్మ కూడా కెప్టెన్‌గా చాలా మంది ఆటగాళ్లను విశ్వసించి అవకాశాలు ఇచ్చాడు. కెప్టెన్ అంటే తన ఆటగాళ్లకు అండగా నిలబడాలి. ఇప్పుడు గిల్ కూడా తమ ఆటగాళ్లకు అండగా నిలబడాలి. తనకు కావాల్సిన ఆటగాళ్లను ఎంచుకునే స్వేచ్ఛ అతడికి ఉంది. ఈ విషయాన్ని బీసీసీఐకి సూటిగా చెప్పాలి’ అని పేర్కొన్నాడు.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి సీనియర్ ఆటగాళ్ల భవిష్యత్తుపై జట్టు యాజమాన్యం స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని కైఫ్ అభిప్రాయపడ్డాడు. ‘స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల జట్టులో పారదర్శకత పెరుగుతుంది. అప్పుడే గిల్ కెప్టెన్‌గా మరింత గౌరవాన్ని సంపాదిస్తాడు. ప్రతి విషయం బయటకు వస్తున్న ఈ రోజుల్లో ఏదీ దాచిపెట్టలేం. అందుకే ఈ అంశంపై క్లారిటీ రావాలి. ఇతరులు చెప్పకపోయినా కెప్టెన్ ముందుకొచ్చి మాట్లాడితే జట్టుకు మేలు జరుగుతుంది’ అని కైఫ్ వ్యాఖ్యానించాడు. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్ సందర్భంగా రోహిత్ రిటైర్మెంట్‌పై వార్తలు వచ్చినప్పటికీ.. బీసీసీఐ వాటిని ఖండించింది. అదే సమయంలో రోహిత్ 138 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ ఆడి తన వన్డే కెరీర్‌పై ఉన్న సందేహాల పటాపంచలు చేశాడు. రోహిత్ కావాలని గిల్ అడిగితే.. బీసీసీఐ సెలెక్టర్లు కూడా ఓకే చెప్పాలి ఉంటుంది.

