Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. సచిన్, సెహ్వాగ్ తర్వాత..!

Shubman Gill Record

Shubman Gill Record

టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అరుదైన ఘనతను ఖాతాలో వేసుకున్నాడు. టెస్టు క్రికెట్‌లో 3,000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. భారత్‌, శ్రీలంక మధ్య కొలంబోలో జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు ఈ ఫీట్ సాధించాడు. తొలి ఇన్నింగ్స్‌లో కేశర నువంత వేసిన 23వ ఓవర్‌లో బౌండరీ కొట్టడంతో గిల్‌ 3,000 టెస్టు పరుగులను పూర్తి చేసుకున్నాడు. దీంతో అత్యంత పిన్న వయసులో ఈ మైలురాయిని అందుకున్న నాలుగో భారత బ్యాటర్‌గా గిల్ రికార్డుల్లో నిలిచాడు.

శుభ్‌మన్ గిల్‌ 26 ఏళ్ల 349 రోజుల వయసులో 3,000 టెస్టు పరుగులు పూర్తి చేశారు. దాంతో ఈ ఘనత సాధించిన భారత ఆటగాళ్లలో నాలుగో అత్యంత పిన్న వయస్కుడిగా నిలిచాడు. ఈ జాబితాలో దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో ఉన్నాడు. సచిన్ 23 ఏళ్ల 228 రోజులకే 3,000 టెస్టు పరుగులు పూర్తి చేశాడు. మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ 26 ఏళ్ల 157 రోజుల వయసులో ఈ మైలురాయిని అందుకోగా.. దిలీప్ వెంగ్‌సర్కార్ 26 ఏళ్ల 263 రోజుల వయసులో 3,000 టెస్టు పరుగుల మార్క్‌ను చేరుకున్నాడు. ఇప్పుడు గిల్ నాలుగో స్థానాన్ని దక్కించుకున్నాడు.

టీమిండియా టెస్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన శుభ్‌మన్ గిల్‌కు ఈ మైలురాయి మరింత ప్రత్యేకంగా మారింది. భారత టెస్టు జట్టును ముందుండి నడిపిస్తున్న సమయంలోనే 3,000 పరుగుల క్లబ్‌లోకి ప్రవేశించడం అతడి కెరీర్‌లో మరో ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. తొలి టెస్టులో శ్రీలంకపై 165 పరుగుల తేడాతో భారత్‌ విజయం సాధించింది. ఇప్పుడు రెండో టెస్టులోనూ ఆధిపత్యం కొనసాగించాలనే లక్ష్యంతో గిల్ సేన బరిలోకి దిగింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 32 ఓవర్లలో రెండు వికెట్స్ కోల్పోయి 110 రన్స్ చేసింది. యశస్వి జైస్వాల్ (45), కేఎల్ రాహుల్ (18) పెవిలియన్‌కు చేరారు. శుభ్‌మన్ గిల్ (29), దేవదత్ పడిక్కల్ (22) క్రీజులో ఉన్నారు. ఈ ఇద్దరు మూడో వికెట్‌కు ఇప్పటికి 96 బంతుల్లో 50 పరుగులు జోడించారు.