Site icon NTV Telugu

Cricket: విరాట్ కోహ్లీ స్థానానికి శ్రేయాస్ అయ్యర్ ఎసరు?

టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం పేలవ ఫామ్‌లో ఉన్నాడు. గత రెండేళ్లుగా అతడి కెరీర్‌లో సెంచరీ అనేది లేదు. అయినా అతడు కెప్టెన్‌ కాబట్టి ఇన్నాళ్లూ జట్టులో కొనసాగుతూ వచ్చాడు. ఇప్పుడు కెప్టెన్సీ కూడా పోయింది. కెప్టెన్‌గా తప్పుకున్న తర్వాత కోహ్లీ బ్యాటింగ్‌లో మార్పు వస్తుందని చాలా మంది ఆశించారు. కానీ అతడి బ్యాటింగ్‌లో మునుపటి వాడి, వేడి లేవనే విషయం మాత్రం అర్థమవుతోంది. అడపాదడపా కష్టపడి హాఫ్ సెంచరీలు కొడుతున్నా అవి సాధికారిక ఇన్నింగ్స్‌లు అయితే కావు.

కానీ ప్రస్తుతం శ్రీలంక సిరీస్‌కు కోహ్లీ తప్పుకోవడంతో సెలక్టర్లు శ్రేయాస్ అయ్యర్‌కు అవకాశమిచ్చారు. వచ్చిన అవకాశాన్ని శ్రేయాస్ రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. వరుసగా మూడు మ్యాచ్‌లలో మూడు హాఫ్ సెంచరీలు చేసి సత్తాచాటాడు. ఈ మూడు అల్లాటప్పా ఇన్నింగ్స్‌లు కాదు. ఓపెనర్లు విఫలమైన వేళ క్రీజులోకి వచ్చి దూకుడుగా ఆడి జట్టుకు విజయాలు కట్టబెట్టిన ఇన్నింగ్స్. అందుకే శ్రీలంకతో సిరీస్‌లో శ్రేయాస్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. వరుసగా 57, 74, 73 స్కోర్లతో దుమ్మురేపాడు. టెస్ట్ సిరీస్ పక్కన బెడితే.. వచ్చే ఐపీఎల్‌లో కోహ్లీ ఆడకుంటే భవిష్యత్‌లో పరిమిత ఓవర్ల క్రికెట్లో అతడి స్థానాన్ని శ్రేయాస్ అయ్యర్ ఆక్రమించడం ఖాయంగా కనిపిస్తోంది. అటు ఇదే స్థానానికి సూర్యకుమార్ యాదవ్ కూడా పోటీలో ఉన్నాడు. సో విరాట్ కోహ్లీ అప్రమత్తంగా ఉండి ఫామ్‌ను అందుకోకుండా జట్టులో అతడి ప్లేస్ గల్లంతైనా కావొచ్చు.

Exit mobile version