Shreyas Iyer Opens Up On Ireland Series Loss Ahead Of IND vs ENG 1st T20: ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో 0-2తో పరాజయం పాలవడం తమకు తీవ్ర నిరాశ కలిగించిందని భారత జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. ఇంగ్లండ్‌తో ప్రారంభమయ్యే టీ20 సిరీస్‌కు ముందు మీడియాతో మాట్లాడిన అయ్యర్.. ఐర్లాండ్ తమ అంచనాలకు మించి ఆడిందని అంగీకరించాడు. అయితే ఆ ఓటమి తమకు ఎన్నో పాఠాలు నేర్పిందని, ఇప్పుడు పూర్తిగా కొత్త ఆరంభానికి సిద్ధమవుతున్నామని చెప్పాడు. ఓటమి అనంతరం ఓ సమయంలో కన్నీళ్లు ఆపుకోలేకపోయా అని శ్రేయాస్ చెప్పుకొచ్చాడు.
తీవ్ర నిరాశ కలిగించింది:
‘ఐర్లాండ్ ఓటమి అవమానకరం ఏమీ కాదు. కానీ మాకు తీవ్ర నిరాశ కలిగించింది. ఐర్లాండ్ ఇంత అద్భుతంగా ఆడుతుందని మేము ఊహించలేదు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ప్రతి విభాగంలో వాళ్లు మమ్మల్ని మించి ఆడారు. గ్రౌండ్ డైమెన్షన్స్, పిచ్ పరిస్థితులను వారు అద్భుతంగా అర్థం చేసుకున్నారు. కానీ మేము మాత్రం వాటిని సరిగ్గా విశ్లేషించడంలో, ప్రణాళికలు సిద్ధం చేయడంలో వెనుకబడ్డాం. విజయం క్రెడిట్ ఐర్లాండ్ జట్టు వ్వాల్సిందే’ అని శ్రేయాస్ అయ్యర్ పేర్కొన్నాడు.
బెల్‌ఫాస్ట్ పరిస్థితులకు అలవాటు పడలేకపోయాం:
ఐర్లాండ్‌లోని బెల్‌ఫాస్ట్ మైదానం ప్రత్యేకత కూడా తమ ఓటమికి ఒక కారణమైందని శ్రేయస్ అయ్యర్ వివరించాడు. చాలా సంవత్సరాల తర్వాత అక్కడ ఆడడం వల్ల పిచ్, అవుట్‌ఫీల్డ్ పరిస్థితులను అర్థం చేసుకోవడంలో ఇబ్బంది ఎదురైందని చెప్పాడు. ‘బెల్‌ఫాస్ట్‌లోని మైదానం సాధారణ స్టేడియంలా అనిపించలేదు. అవుట్‌ఫీల్డ్ నెమ్మదిగా ఉండటంతో పాటు సమంగా కూడా లేదు. గ్రౌండ్ డైమెన్షన్స్ కూడా భిన్నంగా ఉండటంతో కెప్టెన్‌గా ఫీల్డింగ్ సెట్టింగ్ చేయడం సవాల్‌గా మారింది. ఐపీఎల్‌లో అన్ని మైదానాలు సమానంగా ఉండటంతో అలాంటి పరిస్థితులకు మేము అలవాటు పడ్డాం. అక్కడ మాత్రం పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి’ అని అయ్యర్ వివరించాడు.
ఇంగ్లండ్‌లో పరిస్థితులు భిన్నం:
ఇంగ్లండ్‌లో పరిస్థితులు బెల్‌ఫాస్ట్‌తో పోలిస్తే మెరుగ్గా ఉంటాయని అయ్యర్ విశ్వాసం వ్యక్తం చేశాడు. అక్కడి మైదానాలు సమతుల్యంగా ఉండటంతో పాటు స్టేడియం వాతావరణం కూడా ఆటగాళ్లకు మంచి అనుభూతిని కలిగిస్తుందని అన్నాడు. ‘ఇంగ్లండ్‌లో మైదానాల డైమెన్షన్స్ సాధారణంగానే ఉంటాయి. స్టేడియం వాతావరణం, ప్రేక్షకుల మద్దతు మ్యాచ్‌ను మరింత ఉత్కంఠగా మారుస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో మేము గతంలో కూడా ఆడాం. అందుకే ఈ సిరీస్‌కు పూర్తిగా సిద్ధంగా ఉన్నాం’ అని తెలిపాడు.
నా ఫామ్‌పై ఎలాంటి ఆందోళన లేదు:
ఐర్లాండ్ సిరీస్‌లో ఆశించిన స్థాయిలో రాణించకపోయినా తన ఫామ్ గురించి ఎలాంటి ఆందోళన లేదని శ్రేయస్ స్పష్టం చేశాడు. నెట్స్‌లో తాను బంతిని అద్భుతంగా టైమ్ చేస్తున్నానని, మ్యాచ్‌లో కూడా ఒక్కోసారి అదృష్టం కలిసి రాకపోవడం సహజమని చెప్పాడు. ‘నెట్స్‌లో నేను చాలా బాగా బ్యాటింగ్ చేస్తున్నాను. గత మ్యాచ్‌లో కూడా బంతిని అద్భుతంగా టైమ్ చేశాను. కానీ ఒక బంతి అనూహ్యంగా బౌన్స్ అయి ఇన్నర్ ఎడ్జ్ తీసుకుంది. అలాంటి సమయంలో నా బ్యాటింగ్‌ను అంచనా వేయలేం. నా ఆటపై నాకు పూర్తి నమ్మకం ఉంది. ఒత్తిడిలో ఎలా ఆడాలో నాకు బాగా తెలుసు. నా సహజ శైలిపైనే విశ్వాసం ఉంచుతున్నాను’ అని అయ్యర్ ధీమా వ్యక్తం చేశాడు.

