Shreyas Iyer: అప్పుడు నాకు మరో ఆప్షన్ లేదు.. ఒక ఓవర్‌తో అతడిని నిందించొద్దు!

Shreyas Iyer Comments

Shreyas Iyer Comments

Shreyas Iyer on India Win vs Afghanistan 1st T20I: ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆదివారం అఫ్గానిస్థాన్‌తో జరిగిన తొలి టీ20లో భారత్ అదరగొట్టింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో చెలరేగి అద్భుత విజయాన్ని ఖాతాలో వేసుకుంది. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్‌ను 20 ఓవర్లలో 156/8 పరుగులకే పరిమితం చేసింది. అనంతరం 13.4 ఓవర్లలోనే మూడు వికెట్స్ కోల్పోయి 157 పరుగులు చేసి ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. భారత్ విజయంలో అభిషేక్‌ శర్మ (82; 32 బంతుల్లో 7×4, 7×6), ఇషాన్‌ కిషన్‌ (42; 33 బంతుల్లో 5×4, 1×6), అర్ష్‌దీప్‌ సింగ్ (3/19) కీలక పాత్ర పోషించారు.

మ్యాచ్ అనంతరం భారత టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బౌలర్ల ప్రదర్శనపై ప్రశంసలు కురిపించాడు. ‘బౌలింగ్ విభాగం సమష్టిగా రాణించింది. ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవడం వల్లే అఫ్గానిస్థాన్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేయగలిగాము. టీమిండియాకు జస్ప్రీత్ బుమ్రా గొప్ప ఆస్తి. బుమ్రా ఇచ్చిన ఆరంభం మిగతా బౌలర్లకు మంచి ఊపును అందించింది. అర్ష్‌దీప్‌ సింగ్ కూడా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. స్పిన్నర్లు అక్షర్ పటేల్‌, వరుణ్ చక్రవర్తి తమ వంతు పాత్రను సమర్థంగా పోషించారు. బౌలర్ల సమష్టి కృషి అద్భుతం’ అని సర్పంచ్ సాబ్ ప్రశంసించాడు. మ్యాచ్‌లో జట్టంతా ఒకే లక్ష్యంతో పనిచేయడం విజయానికి ప్రధాన కారణమని పేర్కొన్నాడు.

అఫ్గానిస్థాన్ ఇన్నింగ్స్ చివరి ఓవర్‌ను శివమ్ దూబేకి ఇవ్వడంపై శ్రేయస్ అయ్యర్ స్పందిస్తూ.. ఆ సమయంలో మరో ప్రత్యామ్నాయం లేదని తెలిపాడు. ’20వ ఓవర్‌లో బౌలింగ్‌కు రావడంతో పిచ్‌ వేగాన్ని, బంతి ఎలా స్పందిస్తుందో పూర్తిగా అంచనా వేయడం దూబేకు కష్టమై ఉండొచ్చు. భారీగా రన్స్ ఇవ్వడం క్రికెట్‌లో భాగమే. దూబే కూడా ఆ ఓవర్‌ను విశ్లేషించుకుని మెరుగుపరుచుకోవాల్సిన అంశాలపై దృష్టి పెడతాడు. ఒక ఓవర్ ఆధారంగా ఆటగాడిని నిందించొద్దు’ అని చెప్పాడు. 20వ ఓవర్‌ వేసిన దూబే 21 పరుగులు ఇచ్చాడు. అజ్మతుల్లా ఒమర్‌జాయ్ రెండు సిక్సులు బాధగా.. ముజీబ్ ఉర్ రెహ్మాన్ రెండు ఫోర్లు బాదాడు.

భారత ఓపెనర్ ఇషాన్ కిషన్‌ ప్రస్తుత ఫామ్‌పై కూడా శ్రేయస్ అయ్యర్ ప్రశంసలు కురిపించాడు. ఇషాన్ ఇప్పుడు మంచి ఫామ్‌లో ఉన్నాడని, డ్రెస్సింగ్‌ రూమ్‌లోనూ, ప్రాక్టీస్‌ సెషన్లలోనూ చాలా ప్రశాంతంగా కనిపిస్తున్నాడని చెప్పాడు. ‘ఇషాన్ ప్రస్తుతం తన ఆటపై చాలా స్పష్టతతో ఉన్నాడు. అతడు చాలా రిలాక్స్‌డ్‌గా, ప్రశాంతంగా కనిపిస్తున్నాడు. తన ఆట ఏంటో అతడికి ఇప్పుడు బాగా తెలుసు. ఇది జట్టుకు చాలా మంచి సంకేతం’ అని శ్రేయస్ పేర్కొన్నాడు. ఇక మ్యాచ్‌లో ఓపెనర్ అభిషేక్‌ శర్మ ఆడిన షాట్లను శ్రేయస్ ప్రత్యేకంగా ప్రశంసించాడు. అతడి బ్యాటింగ్‌ చాలా అద్భుతంగా ఉందని, ఎక్కడా చిన్న పొరపాటు చేయలేదని చెప్పుకొచ్చాడు.