Shikhar Dhawan Gets A Golden Chance To Break Two Records: శుక్రవారం నుంచి వెస్టిండీస్, భారత్ మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే! ఈ వన్డే సిరీస్‌లో శిఖర్ ధావన్ తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ క్రమంలోనే ఇతనికి రెండు అరుదైన అవార్డులు నమోదు చేసే సువర్ణవకాశం లభించింది. ఒక రికార్డ్ అయితే బద్దలవ్వడం ఖాయం. ఎలాంటి గాయాలపాలవ్వకుండా ఈ సిరీస్‌లో రెండు లేదా మూడు మ్యాచ్‌లు ఆడితే.. వెస్టిండీస్ గడ్డపై అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా శిఖర్ ధావన్ నిలుస్తాడు. ఇప్పటివరకూ ఈ జాబితాలో మాజీ కెప్టెన్లు విరాట్ కోహ్లీ, మహేంద్రసింగ్ ధోనీ 15 మ్యాచ్‌లతో అగ్రస్థానంలో ఉన్నారు. ఆ తర్వాత రోహిత్ శర్మ, యువరాజ్ సింగ్, ధావన్‌లు 14 మ్యాచ్‌లతో రెండో స్థానంలో ఉన్నారు. తాజా వన్డే సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు ఆడితే.. మొత్తం 17 మ్యాచ్‌లతో ధావన్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంటాడు.
ఇదే సమయంలో ఈ సిరీస్‌లో ధావన్ బ్యాట్‌తో చెలరేగితే.. పరుగుల పరంగా ధోనీ, రోహిత్‌లను అధిగమించే ఆస్కారం ఉంది. ఇప్పటివరకూ విండీస్ గడ్డపై అత్యధిక పరుగులు చేసిన జాబితాలో విరాట్ కోహ్లీ 790 పరుగులతో మొదటి స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత ధోనీ (458), యువరాజ్ (419), రోహిత్ (408), ధావన్ (348) వరుసగా రెండు, మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు. ఈ సిరీస్‌లో ధావన్ 110 పరుగులు చేయగలిగితే.. అందరినీ వెనక్కు నెట్టేసి, కోహ్లీ తర్వాత రెండో స్థానంలో నిలుస్తాడు. మరి, ఈ ఫీట్‌ని అతడు అందుకోగలుగుతాడా? లెట్స్ వెయిట్ అండ్ సీ! కాగా.. భారత కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌లకు సెలెక్షన్ కమిటీ విశ్రాంతి ఇచ్చిన నేపథ్యంలో, శిఖర్ ధావన్‌ను తాత్కాలిక కెప్టెన్‌గా నియమించారు. ఇదివరకే శ్రీలంక టూర్‌లో ధావన్ ఇలాగే తాత్కాలిక కెప్టెన్ బాధ్యతల్ని చేపట్టాడు. ఇప్పుడు రెండోసారి తనకు కెప్టెన్సీ అవకాశం రావడంతో.. దీనిని పూర్తిగా సద్వినియోగ పరచుకోవాలని భావిస్తున్నాడు.
