Shikar Dhawan: లక్నో వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో 9 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి పాలైన విషయం తెలిసిందే. ముఖ్యంగా 250 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు శుభారంభం లభించలేదు. ఓపెనర్లు శిఖర్ ధావన్, శుభ్‌మన్ గిల్ దారుణంగా విఫలమయ్యారు. అనంతరం రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ జిడ్డు బ్యాటింగ్ ఆడటంతో రన్‌రేట్ కొండెక్కింది. చివరకు సంజు శాంసన్ పోరాడినా ఫలితం దక్కలేదు. అయితే ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన ధావన్ ప్రణాళికలకు తగ్గట్లు ఆడలేకపోయామని వివరించాడు. తమ ఆటగాళ్ల పోరాటం మాత్రం తనను ఆకట్టుకుందని తెలిపాడు.
Read Also: Strongest Man: వామ్మో!.. ఏకంగా 548కిలోలు ఎత్తేశాడుగా
బౌలింగ్‌కు అనుకూలమైన ఈ పిచ్‌పై తమ జట్టు ధారాళంగా పరుగులు ఇచ్చిందని.. అంతేకాకుండా చెత్త ఫీల్డింగ్ చేయడంతో ఈ రెండు తప్పిదాలు తమ విజయాన్ని దూరం చేశాయని టీమిండియా తాత్కాలిక కెప్టెన్ ధావన్ వెల్లడించారు. తొలి వన్డేలో ఓటమి తమకు గుణపాఠం లాంటిదని చెప్పాడు. శ్రేయస్ అయ్యర్, సంజు శాంసన్, శార్దూల్ ఠాకూర్ అద్భుతంగా ఆడి విజయానికి చేరువగా తీసుకువెళ్లారని.. వాళ్ల ప్రదర్శన పట్ల గర్వంగా ఉందని ధావన్ పేర్కొన్నాడు. కాగా టీమిండియా అగ్రశ్రేణి ఆటగాళ్లు మాత్రం టీ20 ప్రపంచకప్ కోసం ఆస్ట్రేలియా వెళ్లగా దక్షిణాఫ్రికా మాత్రం సీనియర్ ఆటగాళ్లతోనే టీమిండియాతో వన్డే సిరీస్ ఆడుతుండటం గమనించాల్సిన విషయం.
