భారత క్రికెట్ జట్టుకు ఒక్కసారైనా ఆడాలని ప్రతి క్రికెటర్‌కూ కోరిక ఉంటుంది. అందుకోసం వాళ్లు పడే శ్రమ అంతా ఇంతా కాదు. కానీ, అందరికీ అవకాశాలు అంత సులువుగా దొరకవు. సెలక్టర్లకూ ఎవరిని ఎంపిక చేయాలన్నది పెద్ద ఛాలెంజ్‌తో కూడుకున్న పని. అయితే.. కొందరు మాత్రం ఆటగాళ్ల పట్ల దురుసుగా ప్రవర్తిస్తుంటారని అప్పుడప్పుడు ఆరోపణలు వస్తుంటాయి. తాజాగా భారత వెటరన్ క్రికెటర్ షెల్డన్ జాక్సన్ కూడా ఓ సెలక్టర్ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. 30 ఏళ్లు పైబడిన ఆటగాళ్లను భారత జట్టుకి ఎంపిక చేయడం లేదని ఓ సెలక్షన్ అధికారి తనతో చెప్పారని అతడు కుండబద్దలు కొట్టాడు.
‘‘30 ఏళ్లు పైబడిన ప్లేయర్స్‌ని టీమిండియాకు ఎంపిక చేయట్లేదని నాతో ఓ సెలక్షన్ అధికారి పేర్కొన్నాడు. వయసుని సాకుగా చూపి, భారత సెలక్టర్లు డ్రామాలాడుతున్నారు. 30 ఏళ్లు పైబడిన వారిని భారత జట్టుకి ఎంపిక చేయకూడదనే చట్టం ఏదైనా ఉందా? ఇలా ఏదైనా ఉంటే.. ఇటీవల ఓ 32 ఏళ్ల ఆటగాడిని భారత జట్టుకు ఎలా ఎంపిక చేశారు? ప్రతి ఒక్క క్రికెటర్‌కు భారత జట్టుకు ఆడాలన్నది ఓ కల. దాన్ని సాకారం చేసుకునేందుకే ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తారు. సెలక్టర్ల నుంచి పిలుపు వచ్చే వరకూ నా ప్రయత్నాలను విరమించుకోను’’ అని జాక్సన్ చెప్పుకొచ్చాడు. దేశవాళీ క్రికెట్‌లో బాగా రాణిస్తున్నా, తనను టీమిండియాకు ఎందుకు ఎంపిక చేయట్లేదో అర్ధం కావట్లేదని ఆవేదన వ్యక్తం చేశాడు.
కాగా.. 35 ఏళ్లున్న జాక్సన్, గత ఐపీఎల్ సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఈ లీగ్‌లో అతడు పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు కానీ, దేశవాళీ క్రికెట్‌లో మాత్రం నిలకడగా రాణిస్తున్నాడు. వికెట్ కీపర్ కం బ్యాట్స్మన్ అయిన జాక్సన్.. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 50కి పైగా సగటుతో సత్తా చాటుతున్నాడు. 79 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన ఇతను.. 19 సెంచరీలు, 27 అర్ధ సెంచరీల సాయంతో 5634 పరుగులు చేశాడు.