Site icon NTV Telugu

Shahid Afridi-Gambhir: గౌతమ్ గంభీర్‌పై విమర్శలు చేస్తూ.. కొత్త వివాదానికి తెరలేపిన షాహిద్ అఫ్రిది!

Shahid Afridi Gambhir

Shahid Afridi Gambhir

పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదీ మరోసారి భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై విమర్శలు గుప్పించాడు. గంభీర్ ప్రారంభంలో తీసుకున్న నిర్ణయాలు ఆత్మవిశ్వాసంతో ఉన్నప్పటికీ.. ఆ తరువాత అతని ఆలోచనలు సరిగా లేవన్నాడు. కొంతకాలం గౌతీ నిర్ణయాలు భారత జట్టుకు ప్రతికూలంగా మారాయని అఫ్రిదీ చురకలు అంటించాడు. మరోవైపు సీనియర్ భారత బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ప్రదర్శనలను ప్రశంసించాడు. 2027 వన్డే ప్రపంచకప్ వరకు ఆడగలిగే సామర్థ్యం ఇద్దరిలో ఉందని, భారత జట్టుకు వారి అవసరం చాలా ఉందని పేర్కొన్నాడు. ఇటీవల ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాపై జరిగిన వన్డే సిరీస్‌ల్లో రో-కో ఫామ్ చూస్తే ఇంకా భారత జట్టుకు ఇంకా వారు వెన్నెముకనే అని అఫ్రిదీ చెప్పాడు.

తాజాగా టెలికాం ఏషియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో షాహిద్ అఫ్రిదీ మాట్లాడుతూ… ‘విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు భారత బ్యాటింగ్ లైనప్‌లో కీలకమైన ఆటగాళ్లు. ఇటీవల వారు ఫామ్ చూస్తే 2027 వరల్డ్ కప్ వరకూ ఆడగలరని నాకు అనిపిస్తోంది. భారత జట్టుకు ఇంకా వారు వెన్నెముకనే. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాపై అద్భుతంగా ఆడారు. ఒకే ఫార్మాట్ ఆడుతున్నా.. రో-కోలు బాగా ఆడారు. ఐసీసీ లాంటి పెద్ద టోర్నమెంట్‌లలో ఈ స్టార్ ప్లేయర్లను భారత్ పూర్తిగా వినియోగించుకోవాలి. చిన్న జట్లపై వారికి విశ్రాంతి ఇస్తూ.. కొత్త ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలి’ అని సూచించాడు.

షాహిద్ అఫ్రిదీ, గౌతమ్ గంభీర్ మధ్య ఎప్పటినుంచో వివాదం ఉంది. అందుకే గంభీర్‌ను విమర్శించడంలో అఫ్రిదీ ఎప్పుడూ వెనుకాడడు. దక్షిణాఫ్రికాపై టెస్ట్ ఓటమిపై గంభీరే కారణం అంటూ విమర్శలు గుప్పించాడు. ‘కోచ్‌గా గంభీర్ ప్రారంభంలో ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకున్నాడు. ఇటీవల అతడి ఆలోచనలు సరైనవి కావని నిరూపితమైంది. ఎక్కువ ప్రయోగాలు మంచివి కావు. ఇలా అయితే కష్టమే’ అని అఫ్రిదీ చెప్పుకొచ్చాడు. గంభీర్‌ కోచింగ్‌లో భారత్ లిమిటెడ్ ఓవర్స్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ గెలిచినా.. టెస్టుల్లో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా చేతిలో సిరీస్ ఓటములు చవిచూసింది. కోచింగ్ నుంచి గంభీర్ తప్పుకుంటే మంచిదంటూ పరోక్షంగా అఫ్రిదీ కొత్త వివాదానికి తెర లేపాడు.

వన్డేల్లో తన అత్యధిక సిక్సర్ల రికార్డును బద్దలు కొట్టిన రోహిత్ శర్మపై షాహిద్ అఫ్రిదీ ప్రశంసలు కురిపించాడు. ‘2009 ఐపీఎల్‌లో డెక్కన్ చార్జర్స్ తరఫున ఆడినప్పుడు రోహిత్‌తో కలిసి ఆడాను. రోహిత్ బ్యాటింగ్‌ను నేను ఎప్పుడూ ఇష్టపడతా. ప్రాక్టీస్ సమయంలోనే అతని క్లాస్‌ చూశాను. ఒకరోజు భారత్‌కు ప్రధాన ఆటగాడవుతాడని అనుకున్నాను. అదే నిజమైంది. ఇప్పుడు నా రికార్డును అతడే బద్దలు కొట్టడం నాకు సంతోషంగా ఉంది’ అని అఫ్రిదీ చెప్పుకొచ్చాడు.

Exit mobile version