Shafali Verma: రాత్రంతా నిద్రపోలేదు.. దాని గురించే ఆలోచించా.. షఫాలీ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు!

Shafali Verma Interview

Shafali Verma Interview

Shafali Verma Reveals Sleepless Night: భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ ఓపెనర్ షఫాలీ వర్మ తన బ్యాటింగ్ ప్రదర్శనపై సంతోషం వ్యక్తం చేసింది. తాను అనుకున్న షాట్లు ఆడగలుగుతున్నానని, మైదానంలో అనుకున్నది అమలు చేయగలగడం ఆనందంగా ఉందని తెలిపింది. జింబాబ్వే కెప్టెన్ తన బ్యాటింగ్‌ను అద్భుతమైన ప్రదర్శనగా అభివర్ణించడంపై స్పందిస్తూ.. తన ఆటతీరుతో చాలా సంతోషంగా ఉన్నానని చెప్పింది. రాయ్‌పుర్‌ వేదికగా ఆదివారం జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో భారత మహిళల జట్టు 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా జింబాబ్వే 8 వికెట్ల నష్టానికి 102 పరుగులు చేయగా.. భారత్‌ 8.5 ఓవర్లలో ఒక్క వికెట్‌ మాత్రమే కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. షఫాలీ 25 బంతుల్లో 55 రన్స్ చేసింది.

భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన షఫాలీ వర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా షఫాలీ మాట్లాడుతూ.. ‘గత మ్యాచ్‌లో ఔటైన తీరు నన్ను తీవ్రంగా నిరాశపరిచింది. ఆ మ్యాచ్ తర్వాత రాత్రంతా నిద్ర పట్టలేదు. ఆ నిరాశలోనే ఉండిపోకుండా. తర్వాతి మ్యాచ్‌లో ఏం చేయాలనే దానిపై ఆలోచించా. నా మనసును అదుపులో ఉంచుకుని, మరుసటి రోజు ఎలా ఆడాలనే విషయాన్ని ఆలోచిస్తూ సిద్ధమయ్యా. గత మ్యాచ్‌లో స్పిన్నర్ బౌలింగ్‌లో ఔటైన తీరును విశ్లేషించుకున్నా. ముఖ్యంగా కుడిచేతి వాటం బ్యాటర్‌గా ఆ బంతిని ఎదుర్కొన్న విధానం సరైనది కాదని అర్ధమైంది. అందుకే స్పిన్నర్లను ఎదుర్కొనేటప్పుడు కొంచెం వంగి ఆడుతూ, బంతిని బలంగా కొట్టడం కంటే సరైన టైమింగ్‌పై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నా’ అని వివరించింది.

‘ప్రతి బంతిని బౌండరీకి తరలించాలనే ఆలోచనకు బదులుగా, అవసరమైనప్పుడు సింగిల్స్ తీసుకుంటూ ఇన్నింగ్స్‌ను నిర్మించడంపై దృష్టి పెడుతున్నా. నా మనసులో అనుకున్న ప్రణాళికను ఒక్కో దశలో అమలు చేస్తూ ముందుకు సాగుతున్నా. ఆటలో సరళమైన విధానాన్ని అనుసరించడం నాకు ఉపయోగపడుతోంది. ఈ ఇన్నింగ్స్‌లో ఆడిన కవర్ డ్రైవ్ నాకు అత్యంత ఇష్టమైన షాట్లలో ఒకటి. ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఆడిన ఆ షాట్ నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఆ షాట్ తర్వాత నా ఆటపై మరింత నమ్మకం ఏర్పడింది’ అని షఫాలీ వర్మ వివరించింది.

2025లో ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో తన ఆటతీరును విశ్లేషించుకున్నానని షఫాలీ వర్మ తెలిపింది. అప్పట్లో తనలో మెరుగుపరుచుకోవాల్సిన అంశాల గురించి ఆలోచించగా, ముందుగా నిలకడ సాధించడం ముఖ్యమని గుర్తించినట్లు చెప్పింది. జట్టు కోసం నిలకడగా పరుగులు చేయడమే తన ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నానని వెల్లడించింది. అదే సమయంలో ఆస్ట్రేలియా బ్యాటర్లు ఆడే విధానాన్ని కూడా పరిశీలించినట్లు పేర్కొంది. వారు పరిస్థితులకు అనుగుణంగా ఎలా బ్యాటింగ్ చేస్తారు, పరుగులు ఎలా సాధిస్తారు అనే విషయాలను గమనిస్తూ తన ఆటలో మార్పులు చేసుకునేందుకు ప్రయత్నించానని తెలిపింది. జట్టు కోసం మరిన్ని పరుగులు సాధిస్తూ విజయాల్లో భాగం కావాలనుకుంటున్నానని షఫాలీ చెప్పింది.