NTV Telugu Site icon

Team india: దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు కెప్టెన్‌గా హార్డిక్ పాండ్యా?

Hardik Pandya

Hardik Pandya

ఐపీఎల్ కారణంగా అలసిపోతున్న, గాయపడిన భారత ఆటగాళ్లకు బీసీసీఐ విశ్రాంతి ఇచ్చే ఆలోచనలో ఉంది. త్వరలో కీలక ఇంగ్లండ్ పర్యటన, టీ20 ప్రపంచ కప్ ఉన్న నేపథ్యంలో కనీసం మూడు వారాల పాటు విశ్రాంతి ఇవ్వాలని బీసీసీఐ యోచిస్తోంది. ఐపీఎల్ ముగియగానే జూన్ 9 నుంచి దక్షిణాఫ్రికాతో ప్రారంభం కానున్న ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌కు టీమిండియా జట్టుకు సీనియర్ ఆటగాళ్లు దూరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, జస్‌ప్రీత్ బుమ్రా, రిషబ్ పంత్ వంటి ఆటగాళ్లు దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు దూరంగా ఉండనున్నారు.

Symonds: ఆస్ట్రేలియా క్రికెట్‌లో మరో విషాదం.. సైమండ్స్ కన్నుమూత

కీలక ఆటగాళ్లు దూరం కానున్న సందర్భంగా యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని సెలక్టర్లు భావిస్తున్నారు. దీంతో కెప్టెన్సీ రేసులో ఎవరు ఉంటారన్న విషయం హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల టీమిండియా ఆడుతున్న టీ20లకు శిఖర్‌ ధావన్‌ను సెలక్టర్లు పరిగణనలోకి తీసుకోవడం లేదు. ప్రపంచకప్ కారణంగా దీర్ఘ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కీలక ఆటగాళ్లనే సెలక్టర్లు జట్టులోకి తీసుకుంటున్నారు. దీంతో ప్రస్తుత ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌ను అద్భుతంగా నడిపిస్తున్న హార్డిక్ పాండ్యాకు కెప్టెన్సీ అప్పగించనున్నారనే టాక్ వినిపిస్తోంది. అలాగే తిలక్ వర్మ, ఉమ్రాన్ మాలిక్, దినేష్ కార్తీక్ లాంటి ఆటగాళ్లను సెలక్టర్లు పరీక్షించే అవకాశాలు ఉన్నాయి.