దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో వికెట్ కీపర్ సంజు శాంసన్ స్థానంలో జితేష్ శర్మ జట్టులోకి వచ్చాడు. టీమ్ మేనేజ్‌మెంట్ అంచనాలకు అనుగుణంగా రాణించాడు. స్టంప్స్ వెనుక అద్భుత ప్రదర్శన చేశాడు. మ్యాచ్‌లో చురుగ్గా ఉండడమే కాకుండా.. కొన్ని అద్భుత క్యాచ్‌లు పట్టాడు. ఇన్నింగ్స్ చివరలో 5 బంతులు ఆడి 10 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. భారత్ 101 పరుగుల విజయంలో కీలక పాత్ర పోషించాడు. టీ20 ప్రపంచకప్ 2026 ప్రారంభానికి రెండు నెలల కంటే తక్కువ సమయం ఉండడంతో.. సంజు స్థానంలో జితేష్ మొదటి ఎంపిక వికెట్ కీపర్‌గా ఉన్నాడనే ఊహాగానాలు వస్తున్నాయి.
గత ఏడాది టీ20 క్రికెట్‌లో సంజు శాంసన్ రాణించాడు. 436 పరుగులు చేయగా.. అందులో మూడు సెంచరీలు ఉన్నాయి. అభిషేక్ శర్మతో కలిసి మంచి ఓపెనర్‌గా నిలిచాడు. ఇద్దరు కలిసి టీమిండియాకు మంచి విజయాలు అందించారు. అయితే శుభ్‌మాన్ గిల్ టీ20 జట్టులోకి తిరిగి వచ్చిన తర్వాత సీన్ రివర్స్ అయింది. జట్టులో సంజు స్థానం అనిశ్చితంగా మారింది. ప్లేయింగ్ ఎలెవన్‌లో అతడికి చోటు దక్కకుండా పోయింది. అదే సమయంలో ఇటీవల పెద్దగా ఫామ్‌లో లేడు. దాంతో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో యువ ఆటగాడు జితేష్ శర్మకు టీమ్ మేనేజ్‌మెంట్ అవకాశం ఇచ్చింది. వచ్చిన అవకాశాన్ని అతడు రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు.
టీ20 ప్రపంచకప్ 2026 ప్రారంభానికి రెండు నెలల సమయం కూడా లేదు. ఈ సమయంలో ఫామ్‌లో లేని సంజు శాంసన్ స్థానంలో జితేష్ శర్మ జట్టులోకి వచ్చాడు. అంటే సంజు పక్కన పెట్టినట్లే అర్ధమవుతోంది. మెగా టోర్నీకి మొదటి ఎంపిక వికెట్ కీపర్‌గా జితేష్ శర్మను సిద్ధం చేస్తున్నట్లు బీసీసీఐ హింట్ ఇచ్చేసింది. మిగతా 4 టీ20లలో కూడా జితేష్ ఆడితే.. సంజును పక్కనపెట్టేసినట్లే. అదే నిజమైతే సంజుకు ఇక ఐపీఎల్ ఒక్కటే దిక్కు. ఇప్పుడు భారత జట్టులో అతడు చోటు కోల్పోతే.. మరలా వచ్చే అవకాశాలే లేవు. ఐపీఎల్ 2026లో చెన్నై తరఫున సంజు ఆడనున్న విషయం తెలిసిందే.
