Sanju Samson Apologises to Rohit Sharma: టీమిండియా వికెట్‌కీపర్ సంజు శాంసన్ తన కెరీర్‌లో అత్యంత క్లిష్టమైన దశను గుర్తు చేసుకున్నాడు. 2026 టీ20 ప్రపంచ కప్ సందర్భంగా తాను ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు కోల్పోయిన తర్వాత తీవ్ర నిరాశకు గురయ్యానని, ఆ సమయంలో సీనియర్ ప్లేయర్ రోహిత్ శర్మ తనకు ఆటపై నమ్మకం, ఆత్మవిశ్వాసం కలిగించాడని తెలిపాడు. రోహిత్ చెప్పిన మాటలతో తన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చుకుని.. వెస్టిండీస్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడినట్లు సంజు తెలిపాడు.
జియోస్టార్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంజు శాంసన్ మాట్లాడుతూ… ‘నిజం చెప్పాలంటే.. ఆ సమయంలో రోహిత్ భాయ్ చెప్పిన మాటలను నేను నమ్మలేదు. అందుకు ఇప్పుడు సారీ కూడా చెబుతున్నా. ఆయన తన అనుభవంతో, మనస్ఫూర్తిగా మాట్లాడి ఉండొచ్చు. కానీ ఆ సమయంలో నిరాశలో ఉన్నా కాబట్టి రోహిత్ చూసిన యాంగిల్ నాకు కనిపించలేదు. నేను ఎంత నిరాశలో ఉన్నానో నా ముఖంలోనే కనిపించేది. ఆ తర్వాత గుర్తుచేసుకున్నా. రోహిత్ చెప్పిన మాటలతో నా ఆలోచన విధానం మారింది’ అని చెప్పాడు.
న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ ముగిసిన వెంటనే ప్రపంచ కప్ ప్రారంభమవడంతో.. నిరాశ నుంచి వెంటనే బయటపడలేకపోయానని సంజు తెలిపాడు. ‘ఏదైనా నిరాశ ఎదురైతే దాని నుంచి కోలుకోవడానికి నాకు కనీసం వారం రోజులు పడుతుంది. బాధను లోపల దాచుకునే వ్యక్తిని నేను కాదు. అందుకే నా భావాలు ముఖంలో కనిపిస్తాయి. నాలుగు లేదా ఐదు రోజులు చాలా కష్టంగా గడిచాయి. తర్వాత మెల్లగా మళ్లీ సాధారణ స్థితికి వచ్చాను’ అని సంజు వివరించాడు.
ఆ క్లిష్ట పరిస్థితి తనను మానసికంగా మరింత బలంగా మార్చిందని సంజు శాంసన్ చెప్పాడు. ‘ఓడిపోయానని తెలుసు. ఇక తర్వాత ఏం చేయాలి? అనే ప్రశ్నను నాకు నేనే వేసుకున్నాను. క్రికెట్ ఎందుకు ఆడుతున్నాను?, నా లక్ష్యం ఏమిటి? అని ఆలోచించడం ప్రారంభించాను. ప్రపంచ కప్ జరుగుతుండగానే నన్ను నేను మళ్లీ తెలుసుకున్నాను. ఆ తర్వాత అన్నీ మళ్లీ సవ్యంగా మారిపోయాయి. కొన్ని రోజులు జీవితంలో అద్భుతంగా సాగుతాయి. ఐపీఎల్‌లోనూ, భారత జట్టు తరఫున కూడా మంచి ఇన్నింగ్స్‌లు ఆడాను. మెగా టోర్నీలో వెస్టిండీస్ మ్యాచ్‌లో బాగా ఆడాను. ప్రతి షాట్ సరిగ్గా కనెక్ట్ అయింది. ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ, ప్రక్రియపై దృష్టి పెట్టగానే అన్నీ సహజంగానే జరిగిపోయాయి’ అని చెప్పాడు.
‘పవర్‌ప్లే తర్వాత దూకుడుగా ఆడటం నా సహజ శైలి. వెస్టిండీస్ మ్యాచ్‌లో పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాన్ని మార్చుకోవాల్సి వచ్చింది. నేను దాడి చేయాలనుకున్న ప్రతిసారి మరో ఎండ్‌లో వికెట్ పడుతోంది. అప్పుడు పరిస్థితిని అర్థం చేసుకుని ఓపికగా ఆడాల్సి వచ్చింది. ఆటే గొప్ప గురువు. ఏ సమయంలో ఎలా ఆడాలో అదే మనకు నేర్పిస్తుంది. మ్యాచ్ తర్వాత చేసిన సెలబ్రేషన్ ప్రత్యేకం. అది వ్యక్తిగతంగా దేవుడికి కృతజ్ఞత చెప్పే విధానం. కానీ అది అందరి దృష్టిని ఆకర్షించింది. నేను దేవుడిని బలంగా నమ్ముతాను. కొన్ని షాట్లు ఎలా ఆడానో నాకు కూడా ఆశ్చర్యమే కలిగింది. ఆ రోజు జట్టుకు విజయం అందించడానికి నేను ఒక సాధనంగా మారినందుకు దేవుడికి కృతజ్ఞుడిని. ఆ క్షణం జీవితాంతం నా మనసులో నిలిచిపోతుంది’ అని సంజు భావోద్వేగంగా చెప్పుకొచ్చాడు.

