Samson vs Vaibhav: మూడు మ్యాచ్‌లకేనా.. జోక్ చేస్తున్నారా?.. వైభవ్ అరంగేట్రంపై మండిపడ్డ మాజీ క్రికెటర్!

  • వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రం
  • ప్లేయింగ్ ఎలెవన్ నుంచి సంజు శాంసన్‌ అవుట్
  • వైభవ్ అరంగేట్రంపై మండిపడ్డ మాజీ క్రికెటర్
Vaibhav Sooryavanshi Sanju Samson

Vaibhav Sooryavanshi Sanju Samson

Sanjay Manjrekar Slams BCCI for Sanju Samson Dropped: భారత్, ఇంగ్లండ్ మధ్య మాంచెస్టర్ వేదికగా జరిగిన రెండో టీ20లో 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. అయితే టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ నుంచి సంజు శాంసన్‌ను తప్పించడం మాజీ క్రికెటర్లు, అభిమానుల మధ్య తీవ్ర చర్చకు దారితీసింది. ముఖ్యంగా మాజీ భారత బ్యాటర్ సంజయ్ మంజ్రేకర్.. టీమ్‌ మేనేజ్‌మెంట్‌ నిర్ణయంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో ఘాటుగా స్పందించాడు. మూడు మ్యాచ్‌లలో విఫలమైతే ప్రపంచకప్ హీరోను పక్కనపెడుతారా?.. ఏమైనా జోక్ చేస్తున్నారా? అంటూ ఫైర్ అయ్యాడు.

వైభవ్‌కు అవకాశం ఇవ్వడాన్ని స్వాగతించిన సంజయ్ మంజ్రేకర్.. సంజును జట్టు నుంచి తప్పించడం మాత్రం సరికాదన్నాడు. తన ‘ఎక్స్’ ఖాతాలో స్పందిస్తూ.. ‘భారత్ జెర్సీలో వైభవ్‌ను చూడటం చాలా ఆనందంగా ఉంది. కానీ సంజు శాంసన్ సంగతేంటి?. అతడిని జట్టు నుంచి తప్పించారా?, ఇది నిజమేనా?. గాయపడినందుకే తప్పించి ఉంటారని నేను ఆశిస్తున్నా. లేకపోతే ఇది అత్యంత విచిత్రమైన సెలెక్షన్ నిర్ణయాల్లో ఒకటిగా మిగిలిపోతుంది. సెలక్టర్లు జోక్ చేస్తున్నారా?. వైభవ్‌కు అవకాశం ఇవ్వాలనుకుంటే సంజును మూడో స్థానంలో బ్యాటింగ్‌కు పంపించొచ్చు కదా’ అని రాసుకొచ్చాడు.

టీ20 ప్రపంచకప్ 2026లో సంజు శాంసన్ అద్భుత ప్రదర్శన కనబరిచి ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డు గెలుచుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత మూడు టీ20 ఇన్నింగ్స్‌ల్లో 5, 0, 1 పరుగులు మాత్రమే చేయడంతో అతడిని జట్టు నుంచి తప్పించడం అభిమానుల్లోనూ అసంతృప్తికి కారణమైంది. మూడు మ్యాచ్‌లలో విఫలమైనందుకు పెద్ద ఆటగాడిని పక్కన పెట్టడం సరైన నిర్ణయం కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. మాజీ భారత బ్యాటర్ అంబటి రాయుడు కూడా శాంసన్‌కు మద్దతుగా నిలిచాడు. వైభవ్ అరంగేట్రం ఆనందించాల్సిన విషయమే అయినప్పటికీ.. సంజు ఇటీవల చేసిన సేవలను మరచిపోవద్దని సూచించాడు. ‘వైభవ్‌కు అభినందనలు. అతడి అరంగేట్రం వేడుక చేసుకోవాల్సిందే. కానీ కేవలం మూడు టీ20 మ్యాచ్‌ల క్రితమే సంజు ప్రపంచకప్‌లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచాడనే విషయాన్ని మర్చిపోవద్దు’ అని రాయుడు పేర్కొన్నాడు.

ఈ ఎదురుదెబ్బను సంజు సానుకూలంగా తీసుకుని మరింత బలంగా తిరిగి వస్తాడని తాను విశ్వసిస్తున్నట్లు అంబటి రాయుడు తెలిపాడు. అదే సమయంలో వైభవ్ సూర్యవంశీకి కూడా శుభాకాంక్షలు తెలుపుతూ.. అతడు భారత క్రికెట్‌లో సుదీర్ఘ కెరీర్ కొనసాగించి ఎన్నో రికార్డులు బద్దలు కొట్టాలని ఆకాంక్షించాడు. రెండో టీ20లో వైభవ్ 10 బంతుల్లో 14 పరుగులు చేశాడు. ఎప్పటిలానే రెండు భారీ సిక్సర్లు బాది తన దూకుడును చూపించాడు. అయితే విల్ జాక్స్ బౌలింగ్‌లో స్టంపౌట్ అయ్యి ఇన్నింగ్స్‌ను ముగించాడు. మ్యాచ్‌లో భారత్ నిర్దేశించిన 191 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ 19 ఓవర్లలోనే ఛేదించి నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్ ప్రస్తుతం 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇప్పుడు సిరీస్‌ను కైవసం చేసుకోవాలనుకుంటే భారత్ మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో తప్పక విజయం సాధించాల్సిన పరిస్థితి ఏర్పడింది.