Sanjay Manjrekar: లైవ్‌లో మాజీ క్రికెటర్ల మధ్య వార్‌.. అద్దంలో చూసుకో అంటూ ఒకరిపై మరొకరు సెటైర్లు!

Sanjay Manjrekar And Murali Kartik Fight

Sanjay Manjrekar And Murali Kartik Fight

Sanjay Manjrekar and Murali Kartik On-Air Spat: మాజీ భారత క్రికెటర్లు సంజయ్‌ మంజ్రేకర్‌, మురళీ కార్తీక్‌ మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. ఈ ఇద్దరు లైవ్‌ టెలికాస్ట్‌లో ఒకరిపై మరొకరు సెటైర్లు వేసుకున్నారు. కొంతసేపు ఇద్దరి మధ్య సంభాషణ ఘాటుగా సాగినప్పటికీ.. చివరకు మంజ్రేకర్‌ వెనక్కి తగ్గి పరిస్థితిని చక్కదిద్దారు. మంజ్రేకర్‌, కార్తీక్‌ మధ్య మాటల యుద్ధంకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోకు కామెంట్ల వర్షం కురుస్తోంది. శ్రీలంకతో గాలె వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మూడో రోజు లంచ్‌ బ్రేక్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

లంచ్‌ బ్రేక్‌ సమయంలో స్టూడియోలో ఉన్న మురళీ కార్తీక్‌.. గాలెలో కామెంటరీ చేస్తున్న సంజయ్‌ మంజ్రేకర్‌పై సరదాగా విమర్శలు చేశారు. మంజ్రేకర్‌ మాట్లాడేటప్పుడు ఆయన ముఖ కవళికల్లో కనిపించే ‘పౌట్‌’ గురించి కార్తీక్‌ ప్రస్తావించారు. ఆ పౌట్‌ కారణంగా ఆయన చెప్పేది కొన్నిసార్లు అర్థం చేసుకోవడం కష్టంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. ‘మీ పౌట్‌ సెంచరీలోనే అత్యుత్తమంగా ఉంది. కానీ ఆ పౌట్‌ కారణంగా మీరు చెప్పేది మాకు అర్థం కావడం లేదు. కాబట్టి దాన్ని కాస్త తగ్గించండి’ అంటూ కార్తీక్‌ లైవ్‌లో సెటైర్‌ వేశారు.

మురళీ కార్తీక్‌ వ్యాఖ్యలకు సంజయ్‌ మంజ్రేకర్‌ కూడా అదే స్థాయిలో స్పందించారు. తనపై కెమెరా ఉంచడం కంటే తొలిసారి అంతర్జాతీయ మ్యాచ్‌కు కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న అజింక్య రహానేను చూపించాలని కోరారు. జింక్స్ తనకంటే చూడటానికి, మాట్లాడటానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటాడంటూ కార్తీక్‌పై పంచ్‌ వేశారు. ‘ఇది కాస్త ఎక్కువైంది. కెమెరాను మరో వ్యక్తి వైపు తిప్పగలరా?. అతను చాలా ఆహ్లాదకరమైన వ్యక్తి. ముఖం కూడా చాలా బాగుంటుంది’ అంటూ మంజ్రేకర్‌ వ్యాఖ్యానించారు. అంతటితో ఆగకుండా.. అద్దంలో తనను తాను చూసుకుంటూ ‘సూపర్బ్‌.. సూపర్బ్‌.. సూపర్బ్‌’ అంటూ కార్తీక్‌ గొంతును అనుకరిస్తూ మంజ్రేకర్‌ మరో సెటైర్‌ వేశారు.

సంజయ్ మంజ్రేకర్‌ వ్యాఖ్యలకు మురళీ కార్తీక్‌ కూడా వెంటనే కౌంటర్‌ ఇచ్చారు. ‘నేను అద్దంలో చూసుకోను. అది మీరు చేసే పని’ అంటూ బదులిచ్చారు. దీంతో లైవ్‌ ప్రసారంలో ఇద్దరు మాజీ క్రికెటర్ల మధ్య మాటల యుద్ధం మరింత ఆసక్తికరంగా మారింది. అయితే సంభాషణ మరింత ముదరకముందే మంజ్రేకర్‌ పరిస్థితిని సరదాగా మార్చే ప్రయత్నం చేశారు. తమ మధ్య జరుగుతున్న ఈ వాగ్వాదాన్ని సోషల్‌ మీడియా అభిమానులు బాగా ఎంజాయ్‌ చేస్తారని వ్యాఖ్యానించారు. ‘అద్దంలో చూసుకోవడానికి ఒక కారణం ఉండాలి. మీ విషయంలో అది అంతగా ప్రోత్సాహకరంగా ఉండకపోవచ్చు. ఏదేమైనా.. మనిద్దరం హద్దులు దాటేలా ఉన్నాం. సోషల్‌ మీడియాకు మాత్రం మంచి కంటెంట్‌ దొరుకుతుంది’ అంటూ మంజ్రేకర్‌ నవ్వుతూ వ్యాఖ్యానించారు.

సంజయ్‌ మంజ్రేకర్‌, మురళీ కార్తీక్‌ సరదా మాటల యుద్ధానికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అభిమానులు కూడా ఇద్దరు మాజీ క్రికెటర్ల మధ్య జరిగిన సంభాషణపై తమదైన శైలిలో స్పందిస్తున్నారు. శ్రీలంక-భారత్‌ టెస్టు మ్యాచ్‌ మధ్యలో జరిగిన ఈ సరదా ఘటన క్రికెట్‌ అభిమానుల దృష్టిని ఆకర్షించింది. ఇక తొలి టెస్టులో భారత్ తిరుగులేని స్థితిలో నిలిచింది. శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 284 పరుగులకే ఆలౌటైంది. దాంతో టీమిండియా 178 పరుగుల భారీ ఆధిక్యం సంపాదించింది. వరుణుడు కరుణిస్తే.. మ్యాచ్ మనదే అవుతుంది.