Sachin Tendulkar Makes Candid BCCI Remark: క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తనకు నచ్చిన కెప్టెన్లు ఎవరో వెల్లడించారు. ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానంగా టీమిండియా మాజీ కెప్టెన్లు సౌరవ్ గంగూలీ, ఎంఎస్ ధోనీ పేర్లను చెప్పారు. ఈ ఇద్దరూ తన ఫేవరెట్ కెప్టెన్ల జాబితాలో అగ్రస్థానంలో ఉంటారని సచిన్ స్పష్టం చేశారు. తాజాగా రెడ్డిట్‌లో నిర్వహించిన ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో మాస్టర్ బ్లాస్టర్ ఈ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో ఓ అభిమాని సచిన్‌ను పలు ప్రశ్నలు అడిగాడు. భారత టెస్టు జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన అనుభవం ఎలా ఉందని, ఆ బాధ్యతలకు అలవాటు పడటం ఎంత కష్టమైందని ప్రశ్నించాడు. అలానే టెస్టు క్రికెట్‌లో దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా నాయకత్వాన్ని ఎలా అంచనా వేస్తారని, తాను ఆడిన కెప్టెన్లలో వ్యక్తిగతంగా ఎవరంటే ఎక్కువ ఇష్టమని అభిమాని అడిగాడు. అభిమాని అడిగిన అన్ని ప్రశ్నలకు మాస్టర్ బ్లాస్టర్ ఓపిగ్గా సమాధానాలు ఇచ్చారు.
సచిన్ టెండూల్కర్ మాట్లాడుతూ… ‘కెప్టెన్‌గా భారత జట్టును నడిపించడం గొప్ప గౌరవంగా భావించా. అయితే నాకు నచ్చిన ఆటగాళ్లను పూర్తిగా స్వేచ్ఛగా జట్టులోకి ఎంపిక చేసుకునే అవకాశం ఎప్పుడూ ఉండేది కాదు. 1990వ దశకంతో పోలిస్తే ప్రస్తుతం బీసీసీఐ మరింత వృత్తిపరమైన సంస్థగా మారింది. ఆ కాలంలో భారత క్రికెట్ కొన్ని క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంది’ అని చెప్పుకొచ్చారు. ‘దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా స్ఫూర్తిని నేను ఎంతగానో అభిమానిస్తా. ముందుండి జట్టును నడిపిస్తూ దక్షిణాఫ్రికా క్రికెట్‌కు అద్భుతమైన విజయాలు అందించాడు. దక్షిణాఫ్రికా జట్టు ఐసీసీ టైటిల్ గెలవడం ప్రపంచ క్రికెట్‌కు మంచి పరిణామం’ అని అభిప్రాయపడ్డారు.
తనకు ఇష్టమైన కెప్టెన్ల గురించి అడిగిన ప్రశ్నకు సచిన్ స్పష్టమైన సమాధానం ఇచ్చారు. సౌరవ్ గంగూలీ, ఎంఎస్ ధోనీ తన ఫేవరెట్ కెప్టెన్లు తెలిపారు. గంగూలీ నాయకత్వంలో 2003 వన్డే ప్రపంచ కప్ ఫైనల్ ఆడిన సచిన్.. ధోనీ కెప్టెన్సీలో 2011లో ప్రపంచ కప్ ట్రోఫీని ముద్దాడారు. ఈ ఇద్దరు కెప్టెన్లతో కలిసి ఆడిన అనుభవం ఆయన కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచింది. సచిన్ 1996 నుంచి 2000 మధ్య రెండు విడతల్లో భారత టెస్టు జట్టుకు నాయకత్వం వహించారు. మొత్తం 25 టెస్టుల్లో కెప్టెన్‌గా వ్యవహరించారు. అయితే ఆ సమయంలో భారత జట్టు అనేక సవాళ్లను ఎదుర్కొంది. 2000లో స్వదేశంలో దక్షిణాఫ్రికా చేతిలో టెస్టు సిరీస్ ఓటమి తర్వాత సచిన్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. 2007లో మరోసారి టెస్టు కెప్టెన్సీ చేపట్టే అవకాశం వచ్చినప్పటికీ ఆయన అంగీకరించలేదు. దీంతో ఆ బాధ్యతలు ధోనీకి అప్పగించారు.

