Sachin Tendulkar Fielding: భారత్, పాకిస్థాన్ మ్యాచ్.. పాక్ జెర్సీలో బరిలోకి దిగిన సచిన్.. ఈ షాకింగ్ విషయం తెలుసా?

Sachin Tendulkar In Pakistan Jersey

Sachin Tendulkar In Pakistan Jersey

Sachin Tendulkar in Pakistan Jersey: భారత క్రికెట్ చరిత్రలో దిగ్గజ ఆటగాడు, క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ కెరీర్‌ గురించి ప్రతి ఒక్కరికీ తెలిసిందే. అయితే లిటిల్ మాస్టర్ గురించి చాలా మందికి తెలియని ఓ ఆసక్తికర సంఘటన ఉంది. దాయాది పాకిస్థాన్ టీమ్ తరఫున సచిన్ ఫీల్డింగ్ చేశాడు. భారత జట్టు తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేయడానికి రెండేళ్ల ముందు పాక్ తరఫున ఫీల్డింగ్ చేశాడు. అప్పటికి సచిన్ వయసు కేవలం 13 సంవత్సరాలు మాత్రమే. ఈ ఘటన 1987లో చోటుచేసుకుంది.

1987లో పాకిస్థాన్ జట్టు భారత పర్యటనకు వచ్చింది. ముంబైలోని బ్రబోర్న్ స్టేడియంలో ఇండో-పాక్ జట్ల మధ్య 40 ఓవర్ల మ్యాచ్‌ జరిగింది. ఆ మ్యాచ్‌లో పాక్ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్, జావేద్ మియాందాద్, అబ్దుల్ ఖాదిర్ మైదానం వీడారు. దాంతో పాక్ జట్టుకు ప్రత్యామ్నాయ ఫీల్డర్లు అవసరమయ్యారు. దీంతో క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కెప్టెన్ హేమంత్ కెంక్రేను పాక్ సారథి ఇమ్రాన్ ఖాన్ సంప్రదించి.. స్థానిక యువ ఆటగాళ్లను ఫీల్డింగ్‌కు పంపించాలని కోరాడు. కెంక్రే ఆటగాళ్ల కోసం చూస్తుండగా.. యువ సచిన్ టెండూల్కర్ ఉత్సాహంగా కనిపించాడు. ఆపై పాకిస్థాన్ జట్టు గ్రీన్ జెర్సీ ధరించి సచిన్ మైదానంలోకి అడుగుపెట్టాడు.

ఆ మ్యాచ్‌లో సచిన్‌ టెండూల్కర్‌ అద్భుతంగా ఫీల్డింగ్ చేశాడు. అప్పటి భారత కెప్టెన్ కపిల్ దేవ్ కొట్టిన బంతి.. సచిన్ ఉన్న అవుట్‌ఫీల్డ్ వైపు రావడంతో బాల్ అందుకున్నాడు. ఆపై రెండేళ్లకు టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. భారత్ తరఫున 200 టెస్టులు, 463 వన్డేలు, ఒక టీ20 మ్యాచ్ ఆడాడు. మూడు ఫార్మాట్లలో కలిపి 34 వేలకు పైగా రన్స్ చేశాడు. అయితే పాకిస్థాన్ తరఫున ఫీల్డింగ్ చేయడం క్రికెట్ అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ విషయాన్ని సచిన్ తన ఆత్మకథ ‘Playing It My Way’లో కూడా ప్రస్తావించాడు. “ఒకప్పుడు నేను పాకిస్థాన్ జట్టు తరఫున ఫీల్డింగ్ చేశానని ఇమ్రాన్ ఖాన్‌కు గుర్తుందో లేదో నాకు తెలియదు’ అని పేర్కొన్నాడు.

సచిన్ టెండూల్కర్ చిన్ననాటి స్నేహితుడు మార్కస్ కౌటో కూడా ఈ సంఘటనను గుర్తు చేసుకున్నాడు. మ్యాచ్ అనంతరం ఇద్దరూ కలిసి ముంబై లోకల్ రైలులో ఇంటికి వెళ్తుండగా.. సచిన్ కొంత నిరాశగా కనిపించాడని తెలిపాడు. బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ పెట్టారని, తనవైపు వచ్చిన భారీ షాట్ క్యాచ్ అయ్యేదా అని అడిగాడని, కానీ అది స్టేడియం మొదటి అంతస్తులోకి వెళ్లిపోయిందని తాను చెప్పానని మార్కస్ వెల్లడించాడు. ఆ మ్యాచ్‌లో భారత్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. అనంతరం రెండేళ్లకే సచిన్ భారత జట్టు తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. అదే పాకిస్థాన్‌పై.. వసీం అక్రమ్, వకార్ యూనిస్ వంటి ప్రపంచ స్థాయి బౌలర్లను ఎదుర్కొంటూ తన చిరస్మరణీయ అంతర్జాతీయ ప్రయాణాన్ని ప్రారంభించాడు.