Ten Doeschate-KKR: టీమిండియా తరిమేసింది.. కేకేఆర్‌ అక్కున చేర్చుకుంది.. ర్యాన్ డస్కాటె భలే లక్కీ!

Ryan Ten Doeschate Kkr Ipl 2027

Ryan Ten Doeschate Kkr Ipl 2027

Ryan ten Doeschate appointed Head of Cricket Strategy at KKR: టీమిండియా అసిస్టెంట్ కోచ్ పదవికి వీడ్కోలు పలికిన మరుసటి రోజే ర్యాన్ టెన్ డస్కాటెకు కొత్త బాధ్యతలు దక్కాయి. భారత క్రికెట్ జట్టు కోచింగ్ స్టాఫ్‌లో తన ప్రయాణాన్ని ముగించిన డస్కాటె.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మూడుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) ఫ్రాంచైజీలో చేరాడు. ఈ విషయాన్ని కేకేఆర్ యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది. డస్కాటెకు హెడ్ ఆఫ్ క్రికెట్ స్ట్రాటజీగా నియమిస్తూ.. నైట్ రైడర్స్ గ్లోబల్ క్రికెట్ వ్యవస్థలో కీలక బాధ్యతలు అప్పగించింది.

ర్యాన్ టెన్ డస్కాటె ఇకపై ఆటగాళ్ల అన్వేషణ (స్కౌటింగ్), కొత్త ఆటగాళ్ల ఎంపిక, జట్టు ప్రణాళిక, ప్రతిభాభివృద్ధి, ప్రదర్శన విశ్లేషణ వంటి కీలక అంశాలను పర్యవేక్షించనున్నాడు అని కేకేఆర్ తెలిపింది. అలాగే నైట్ రైడర్స్‌కు చెందిన అన్ని గ్లోబల్ ఫ్రాంచైజీల కోచింగ్ బృందాలతో కలిసి పనిచేయనున్నాడు. అదనంగా కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్, ఐఎల్‌టీ20లో అబుదాబి నైట్ రైడర్స్, మేజర్ లీగ్ క్రికెట్‌లో లాస్ ఏంజెలెస్ నైట్ రైడర్స్ జట్లకు అసిస్టెంట్ కోచ్‌గా కూడా సేవలందించనున్నాడు.

ర్యాన్ టెన్ డస్కాటె నియామకంపై నైట్ రైడర్స్ స్పోర్ట్స్ సీఈఓ వెంకీ మైసూర్ ఆనందం వ్యక్తం చేశారు. ‘టెండోను మళ్లీ నైట్ రైడర్స్ ఫ్యామిలీలోకి స్వాగతించడం ఎంతో సంతోషంగా ఉంది. మా క్రికెట్ ఫిలాసఫీ, వ్యవస్థపై అతడికి పూర్తి అవగాహన ఉంది. అంతర్జాతీయ, ఫ్రాంచైజీ క్రికెట్‌లో అతడికి ఎంతో అనుభవం ఉంది. అందుకే ఈ బాధ్యతలు అప్పగించాం. నైట్ రైడర్స్ గ్లోబల్ వ్యవస్థ అభివృద్ధిలో డస్కాటె కీలక పాత్ర పోషిస్తాడని విశ్వసిస్తున్నాం’ అని పేర్కొన్నారు. మరోవైపు ర్యాన్ టెన్ డస్కాటె కూడా తన పునరాగమనంపై సంతోషం వ్యక్తం చేశాడు. ‘మళ్లీ నైట్ రైడర్స్ కుటుంబంలో చేరడం చాలా ఆనందంగా ఉంది. మా గ్లోబల్ ఫ్రాంచైజీల కోచింగ్, అనలిటిక్స్ బృందాలతో కలిసి స్కౌటింగ్, ప్లేయర్ డెవలప్‌మెంట్ వ్యవస్థలను మరింత బలోపేతం చేయడం, దీర్ఘకాలిక క్రికెట్ వ్యూహాన్ని రూపొందించడం నా ప్రధాన లక్ష్యం’ అని తెలిపాడు.

ర్యాన్ టెన్ డస్కాటెకు నైట్ రైడర్స్ ఫ్రాంచైజీతో దశాబ్దానికి పైగా అనుబంధం ఉంది. 2011లో కేకేఆర్ తరఫున ఆటగాడిగా చేరిన అతడు.. 2012, 2014లో ఐపీఎల్ టైటిళ్లు గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. అనంతరం 2022లో కోచింగ్ బృందంలో చేరి.. 2024లో కేకేఆర్ మూడోసారి ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన సీజన్‌లో కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు కొత్త బాధ్యతలతో మరోసారి నైట్ రైడర్స్ గ్లోబల్ క్రికెట్ వ్యవస్థలో తన ముద్ర వేయడానికి సిద్ధమయ్యాడు.