Site icon NTV Telugu

Ruturaj Gaikwad: యువరాజ్ రికార్డు బద్దలు.. ఏడు బంతుల్లో ఏడు సిక్సర్లు

Ruturaj Gaikwad

Ruturaj Gaikwad

Ruturaj Gaikwad: టీమిండియా యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ నెలకొల్పిన రికార్డును సైతం బద్దలు కొట్టాడు. యువరాజ్ కేవలం ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొడితే రుతురాజ్ మాత్రం 7 బంతుల్లో ఏడు సిక్సర్లు బాదాడు. మధ్యలో ఓ నోబాల్ పడటంతో ఒకే ఓవర్‌లో 43 పరుగులు వచ్చాయి. విజయ్ హజారే ట్రోఫీలో మహారాష్ట్ర ఆటగాడు రుతురాజ్ ఈ ఘనత సాధించాడు. అహ్మదాబాద్ వేదికగా ఉత్తరప్రదేశ్‌లో సోమవారం జరిగిన రెండో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో రుతురాజ్ విశ్వరూపం చూపించాడు. ఉత్తరప్రదేశ్ బౌలర్ శివా సింగ్ వేసిన 49వ ఓవర్‌లో వరుసగా నాలుగు బంతులను రుతురాజ్ సిక్సర్లుగా కొట్టగా.. ఒత్తిడికి గురైన బౌలర్ ఐదో బంతిని నోబాల్‌గా వేశాడు. ఆ బంతిని కూడా సిక్స్ బాదిన రుతురాజ్ తర్వాతి రెండు బంతులను కూడా సిక్సర్లు బాది చరిత్ర సృష్టించాడు.

ఏ స్థాయి క్రికెట్‌లోనైనా ఒకే ఓవర్‌లో ఏడు సిక్స్‌లు బాదిన తొలి క్రికెటర్‌గా రుతురాజ్ గైక్వాడ్ నిలిచాడు. భారత్ తరఫున 6 బంతుల్లో 6 సిక్స్‌లు బాదిన మూడో ఆటగాడిగా గుర్తింపు పొందాడు. దేశవాళీ క్రికెట్‌లో టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి ఈ ఫీట్ సాధించగా.. అంతర్జాతీయ క్రికెట్‌లో యువరాజ్ సింగ్ ఈ ఘనత అందుకున్నాడు. 2007 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో యువరాజ్ ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదాడు. దక్షిణాఫ్రికా ఆటగాడు గిబ్స్, వెస్టిండీస్ ఆటగాడు కీరన్ పొలార్డ్ కూడా 6 బంతుల్లో 6 సిక్స్‌లు బాదారు.

Read Also: Gautam Gambhir: భారత్ vs పాకిస్తాన్.. ఆ ఇద్దరు కలిసి తీసుకోవాల్సిన నిర్ణయం

అటు ఒక ఓవర్‌లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న చెత్త రికార్డును బౌలర్ శివా సింగ్ మూటగట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో విధ్వంసం సృష్టించిన రుతురాజ్ డబుల్ సెంచరీని కూడా అందుకోవడం విశేషం. మొత్తం 159 బంతుల్లో 10 ఫోర్లు, 16 సిక్సర్లతో 220 నాటౌట్‌గా నిలిచాడు. అంకిత్ బావ్నే(37), అజిమ్ కాజీ(37) పరుగులతో రాణించారు. దీంతో మహారాష్ట్ర నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 330 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ మ్యాచ్‌లో గెలవాలంటే ఉత్తరప్రదేశ్ 331 పరుగులు చేయాల్సి ఉంది.

Exit mobile version