Site icon NTV Telugu

INDvsNZ T20: కివీస్‌తో టీ20 సిరీస్‌కు ముందు టీమిండియాకు షాక్!

Team India World Record

Team India World Record

న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో దుమ్మురేపింది టీమిండియా. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసి వన్డే ప్రపంచకప్ జరగనున్న ఏడాదిలో మంచి బోణీ కొట్టింది. ప్రస్తుతం టీ20 సిరీస్‌పై దృష్టిపెట్టింది. హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని యువ జట్టు పొట్టి ఫార్మాట్ సిరీస్ కోసం రెడీ అవుతోంది. ఈ సమయంలోనే టీమిండియా నుంచి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ గాయపడటంతో సిరీస్‌కు అందుబాటులో ఉండే అవకాశం లేదని వార్తలు వస్తున్నాయి. టీ20ల్లో కీలక ఆటగాడిగా ఉన్న గైక్వాడ్ పూర్తి ఫిట్‌నెస్‌తో లేకపోవడంతో సిరీస్ ఆడటంపై సందేహం నెలకొంది. గైక్వాడ్ మణికట్టు నొప్పితో బాధపడుతున్నట్టుగా సమాచారం. హైదరాబాద్‌తో జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో గైక్వాడ్‌కు ఈ గాయం అయింది. హైదరాబాద్‌తో మ్యాచ్‌లో గైక్వాడ్ అంతగా రాణించలేదు. కానీ ప్రస్తుతం అతను అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. తాజా రంజీ ట్రోఫీలో తమిళనాడుపై 195 పరుగుల భారీ ఇన్నింగ్స్ ఆడిన రుతురాజ్ అంతకుముందు ఆంధ్రప్రదేశ్, సౌరాష్ట్రపై హాఫ్ సెంచరీలు సాధించాడు. గత 10 మ్యాచ్‌ల్లో 5 సెంచరీలు, 2 అర్ధసెంచరీలు చేశాడు.

Oscars: ఈ సినిమాకి 10 ఆస్కార్ నామినేషన్స్ వచ్చాయి…

న్యూజిలాండ్‌తో జనవరి 27 నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుండగా, గైక్వాడ్ సరైన సమయానికి ఫిట్‌గా లేకపోతే ఈ సిరీస్‌కు ఎంపికైన పృథ్వీ షా ఓపెనర్‌గా బరిలోకి దిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 2021 శ్రీలంక పర్యటనలో చివరిసారిగా భారత్ తరఫున పరిమిత ఓవర్ల క్రికెట్ మ్యాచ్ ఆడిన పృథ్వీ ఆ తర్వాత జట్టులో చోటు దక్కించుకోలేదు. వెన్ను గాయం కారణంగా న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు దూరమైన మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఇప్పటికే NCAలో శిక్షణ పొందుతున్నాడు. వచ్చే నెలలో ఆస్ట్రేలియాతో జరగనున్న టెస్టు సిరీస్‌లో తొలి 2 టెస్టుల కోసం అయ్యర్‌ను జట్టులోకి తీసుకున్నారు.

Exit mobile version