ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026కు సంబంధించిన వేలం ఇటీవల ముగిసిన విషయం తెలిసిందే. వేలంలో రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) ఆచితూచి వ్యహరించింది. వేలంకు ముందే చెన్నై సూపర్ కింగ్స్‌కు కెప్టెన్ సంజు శాంసన్‌ను ట్రేడ్ చేసింది. మినీ వేలం తర్వాత జడేజా, సామ్ కరణ్, రవి బిష్ణోయ్ వంటి ఆటగాళ్లతో బలమైన జట్టును ఏర్పాటు చేసింది. అయితే కెప్టెన్సీ మాత్రం ప్రశ్నార్థకంగానే ఉంది. దీనిపై భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప తన అభిప్రాయం వ్యక్తం చేశాడు.
జియోస్టార్‌తో రాబిన్ ఉతప్ప మాట్లాడుతూ… ‘రాజస్థాన్ రాయల్స్‌లో 10 మంది ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు. ఆర్ఆర్‌కు చాలా బౌలింగ్ ఎంపికలు ఉన్నాయి. జైపూర్ స్టేడియంలో బౌలర్లు సరైన ప్రాంతాల్లో బౌలింగ్ చేస్తే.. జట్టు విజయాలు అందుకుంటుంది. బిష్ణోయ్, జడేజా వంటి టాప్ స్పిన్నర్లు. షిమ్రాన్ హెట్మెయర్, డోనోవన్ ఫెర్రీరా, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్‌లతో బ్యాటింగ్ బాగుంది. ప్రస్తుతం రాజస్థాన్ జట్టు సమతుల్యంగా కనిపిస్తోంది. అయితే నాకు ఒకే ఒక ప్రశ్న ఉంది, అది కెప్టెన్సీ. కెప్టెన్సీని రియాన్ పరాగ్ లేదా రవీంద్ర జడేజాకు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. యశస్వి జైస్వాల్ మరికొంత కాలం వేచి ఉండాల్సి రావచ్చు’ అని అన్నాడు.
స్పిన్ లెజెండ్ అనిల్ కుంబ్లే కూడా ఆర్ఆర్ జట్టు సమతుల్యతను ప్రశంసించాడు. యువ ఆటగాళ్లు, అనుభవజ్ఞులైన ప్లేయర్స్ సహా ఆల్‌రౌండర్‌లు కీలకమని పేర్కొన్నాడు. జోఫ్రా ఆర్చర్ వంటి కీలక ఫాస్ట్ బౌలర్ల ఫిట్‌నెస్ గురించి ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఈ జట్టును పరిశీలిస్తే.. కెప్టెన్సీ అత్యంత ముఖ్యమైన విషయం. యువ ఆటగాళ్లు, అనుభవజ్ఞులైన ప్లేయర్స్, ఆల్‌రౌండర్‌లతో జట్టు బలంగా ఉంది. ఐపీఎల్ ప్రారంభంలో ఆర్చర్ వంటి కీలక ఆటగాళ్ల ఫిట్‌నెస్ కూడా చాలా కీలకం. చివరగా కెప్టెన్ ఎవరో జట్టు యాజమాన్యం నిర్ణయించి స్పష్టంగా చెప్పాల్సి ఉంటుంది’ అని కుంబ్లే అన్నారు.
