Site icon NTV Telugu

Rohit Sharma: అదే మా కొంప ముంచింది

Rohit Sharma On Loss

Rohit Sharma On Loss

తొలి వన్డేలో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఇంగ్లండ్‌ని భారత్ చిత్తుగా ఓడించడంతో.. రెండో వన్డేలోనూ అదే జోష్ కొనసాగించి, సిరీస్ కైవసం చేసుకుంటుందని అంతా అనుకున్నారు. కానీ, ఆ అంచనాల్ని తిప్పికొడుతూ ఇంగ్లండ్ ఘనవిజయం సాధించింది. లార్డ్స్ మైదానంలో జరిగిన రెండో వన్డేలో 100 పరుగుల తేడాతో భారీ విజయం సొంతం చేసుకుంది. దీంతో.. వన్డే సిరీస్ 1-1తో సమం అయ్యింది. ఈ నేపథ్యంలోనే తమ ఓటమికి గల కారణాల్ని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.

‘‘మా బౌలర్లు బాగా రాణించారు. ఆరంభంలో అదరగొట్టేశారు. అయితే.. మొయిన్‌ అలీ, విల్లే మెరుగైన భాగస్వామ్యాలు నమోదు చేయడంతో ఇంగ్లండ్‌కి పరుగులు కలిసొచ్చాయి. అయినప్పటికీ ఇంగ్లండ్ విధించిన లక్ష్యం.. మరీ చేధించలేనంత పెద్దదేమీ కాదు. సునాయాసంగానే ఛేదించొచ్చు. కాకపోతే మా బ్యాటింగ్ బాగా లేకపోవడం వల్ల ఓటమి చవిచూడాల్సి వచ్చింది. కొన్ని క్యాచ్‌లు వదిలిపెట్టడం కూడా మేము చేసిన అతిపెద్ద తప్పు. బ్యాట్స్మన్లు సరిగ్గా రాణించకపోవడం వల్ల మ్యాచ్ చేజార్చుకోవాల్సి వచ్చింది’’ అని రోహిత్ శర్మ తెలిపాడు.

అలాగే.. పిచ్‌పై కూడా రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘పాతబడే కొద్ది పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుందని అనుకున్నాం. కానీ, అలా జరగలేదు. టాపార్డర్‌లో ఒక్క బ్యాట్స్మన్ కూడా నిలకడగా ఆడకపోవడమే మాకు దెబ్బతీసింది’’ అని పేర్కొన్నాడు. మాంచెస్టర్‌‌లో జరగబోయే మూడో మ్యాచ్‌ కోసం ఆసక్తిగా ఉన్నామని, పరిస్థితులకు అనుగుణంగా మెదులుతూ మెరుగైన ప్రదర్శన కనబరిచేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తామని రోహిత్ శర్మ వెల్లడించాడు. ఈ మ్యాచ్ ఎవరు గెలిస్తే, వారిదే సిరీస్!

Exit mobile version