Site icon NTV Telugu

Rohit Sharma: అప్పుడు ధోనీ.. ఇప్పుడు రోహిత్.. అత్యంత చెత్త రికార్డ్

Rohit Sharma Worst Record

Rohit Sharma Worst Record

Rohit Sharma Creates Worst Record After MS Dhoni: బంగ్లాదేశ్‌తో పోలిస్తే.. టీమిండియాలోనే అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారు. బ్యాటింగ్, బౌలింగ్.. రెండింటిలోనూ దుమ్ముదులిపేయగల అనుభవజ్ఞులు ఉన్నారు. ఎటు చూసినా.. భారత జట్టే బలంగా కనిపిస్తుంది. దీనికితోడు.. భారత్‌తో పోల్చినప్పుడు బంగ్లాను పసికూనలా చూస్తారు. దీంతో.. బంగ్లాతో వన్డే సిరీస్‌ని భారత్ సునాయాసంగా కైవసం చేసుకుంటుందని మొదట్లో అంతా అనుకున్నారు. బంగ్లాను చిత్తుగా ఓడించి, ఈ సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని భావించారు. కానీ, అందుకు భిన్నంగా బంగ్లా జట్టు పెద్ద ట్విస్ట్ ఇచ్చింది. రోహిత్ సేనను మట్టికరిపించింది. ఇంకో మ్యాచ్ మిగిలి ఉండగానే.. సిరీస్‌ను కైవసం చేసుకుంది.

నిజానికి.. ఈ రెండు వన్డే మ్యాచుల్లో భారత్‌కు గెలిచే అవకాశాలు చాలానే దక్కాయి. తొలి మ్యాచ్‌లో చేసింది తక్కువ స్కోరే అయినా, బౌలర్లు అదరగొట్టడంతో బంగ్లా బ్యాటర్లు బెదిరిపోయారు. లక్ష్యం ఇంకా చాలా దూరంలో ఉండగానే.. 9 వికెట్లు కోల్పోయారు. అయితే.. చివరి వికెట్ విషయంలో భారత్ కొన్ని తప్పిదాలు చేసింది. చేతికి అందివచ్చిన రెండు క్యాచ్‌లను మిస్ చేయడంతో.. మెహదీ హసన్ చెలరేగిపోయాడు. చివరివరకు పోరాడి, తన బంగ్లా జట్టుని గెలిపించుకున్నాడు. రెండో మ్యాచ్‌ని కూడా ఇతడే ఆదుకున్నాడు. 69 పరుగులకే 6 వికెట్లు కోల్పోయినప్పుడు.. పునాదిలా నిలబడి, బంగ్లాకు భారీ స్కోరు జోడించాడు. చివరివరకు నిలబడి, తాను సెంచరీ చేసి.. బంగ్లా స్కోరుని 271/7కి చేర్చాడు. ఇక ఛేజింగ్‌లో స్టార్ బ్యాటర్లు చేతులెత్తేయడం.. అయ్యర్, అక్షర్‌లతో పాటు రోహిత్ విధ్వంసం సృష్టించినా, పరిస్థితులు కలిసి రాకపోవడంతో భారత్ ఐదు పరుగుల తేడాతో రెండో మ్యాచ్ కూడా ఓడిపోయింది.

ఫలితంగా.. ఇంకో మ్యాచ్ మిగిలి ఉండగానే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ని బంగ్లాదేశ్ కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే సారథిగా రోహిత్ శర్మ ఒక చెత్త రికార్డ్‌ని తన పేరిట లిఖించుకున్నాడు. బంగ్లా గడ్డపై వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిపోవడంతో పాటు వన్డే సిరీస్‌ను సమర్పించుకున్న రెండో భారత కెప్టెన్‌గా రోహిత్ నిలిచాడు. గతంలో మహేంద్రసింగ్ ధోనీ సారథ్యంలోనూ భారత్ సిరీస్ ఓడిపోయింది. 2015లో ధోనీ కెప్టెన్సీలో భారత్ రెండు మ్యాచ్‌లు ఓడిపోవడంతో, బంగ్లా చేతికి సిరీస్ వెళ్లింది. అయితే.. చివరి వన్డేలో మాత్రం ధోనీ సేన గెలిచి, పరువు కాపాడుకుంది. మరి, రోహిత్ సేన అదే సీన్ రిపీట్ చేస్తుందా? లేక చివరి మ్యాచ్‌ని కూడా సమర్పించుకుంటుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ! కాగా.. ఇప్పటివరకు బంగ్లా పర్యటనలో సౌరవ్‌ గంగూలీ(2004), రాహుల్‌ ద్రవిడ్‌(2007), సురేశ్‌ రైనా(2014) సారథ్యంలో టీమిండియా వన్డే సిరీస్‌లు గెలిచింది. ధోనీ, రోహిత్ సారథ్యంలోనే ఓడింది.

Exit mobile version