Site icon NTV Telugu

Rohit Sharma: హిట్ మ్యాన్‌ కెరీర్‌కు 15 ఏళ్లు పూర్తి.. రోహిత్ ఎమోషనల్ లెటర్

Rohit 15 Years

Rohit 15 Years

టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చి నేటితో 15 ఏళ్లు పూర్తవుతోంది. 2007, జూన్ 23న బెల్‌ఫాస్ట్‌లో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా తరఫున రోహిత్ తన తొలి మ్యాచ్ ఆడాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ కెరీర్‌ 15 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రోహిత్ శర్మ సోషల్ మీడియా ద్వారా ఓ లెటర్‌ను అభిమానులతో పంచుకున్నాడు. తనకు ఇష్టమైన జెర్సీలో ఈ జర్నీని పూర్తి చేసుకున్నట్లు రోహిత్ తెలిపాడు. ఇది ఎంతో గొప్ప ప్రయాణంగా అభివర్ణించాడు. తన ఇన్నేళ్ల క్రికెట్ జర్నీలో భాగమైన క్రికెట్ ప్రేమికులు, విమర్శకులు, అభిమానులు.. ఇలా ప్రతి ఒక్కరికీ రోహిత్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు. తన జీవితాంతం క్రికెట్‌ను ఆదరిస్తానని పేర్కొన్నాడు. భారత క్రికెటర్ల పట్ల అభిమానులు చూపుతున్న ప్రేమాభినాలు టీమిండియాను ఈ స్థాయిలో ఉంచాయని రోహిత్ అన్నాడు.

కాగా రోహిత్ శర్మ ఇప్పటివరకు తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో మొత్తం 230 వన్డేలు, 125 టీ20లు, 45 టెస్టులు ఆడాడు. టీమిండియా తరపున అన్ని ఫార్మాట్‌లలో కలిపి 15,733 పరుగులు చేశాడు. టెస్టుల్లో 8 సెంచరీలు, వన్డేల్లో 29 సెంచరీలు, టీ20ల్లో 4 సెంచరీలు రోహిత్ ఖాతాలో ఉన్నాయి. ప్రస్తుతం టీమిండియాకు అన్ని ఫార్మాట్లలో కెప్టెన్సీ నుంచి కోహ్లీ తప్పుకోవడంతో ఆ బాధ్యతలను రోహిత్ శర్మకు జట్టు మేనేజ్‌మెంట్ అప్పగించింది. త్వరలో ఇంగ్లండ్‌తో జరగనున్న టెస్టులో భారత్‌కు రోహిత్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. జులై 1వ తేదీన ఈ టెస్ట్ మ్యాచ్ ప్రారంభం అవుతుంది.

 

Exit mobile version