Site icon NTV Telugu

Rohit Sharma: రోహిత్ సంచలనం.. కోహ్లీ రికార్డ్ బద్దలు

Rohit Breaks Virat Record

Rohit Breaks Virat Record

Rohit Sharma Breaks Virat Kohli Record: భారత క్రికెట్ జట్టు సారథిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రోహిత్ శర్మ తన ఖాతాలో వరుసగా రికార్డుల మీద రికార్డులు వేసుకుంటున్నాడు. ఇప్పుడు తాజాగా మరో రికార్డ్‌ని తన పేరిట లిఖించుకున్నాడు. నిన్న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఆస్ట్రేలియాపై విజయం సాధించడంతో.. రోహిత్ ఆ అరుదైన ఘనత సాధించాడు. కెప్టెన్‌గా రోహిత్‌కు ఇది 33వ విజయంస. టీ20ల్లో అత్యధిక విజయాలు సాధించిన రెండో భారత కెప్టెన్‌గా రోహిత్ రికార్డులకెక్కాడు. అంతకుముందు ఈ రికార్డ్ విరాట్ కోహ్లీ పేరిట ఉండేది. అతని సారథ్యంలో భారత్ 32 టీ20 మ్యాచెస్‌లో విజయాలు సాధించింది. ఇప్పుడు ఆ రికార్డ్‌ని రోహిత్ బద్దలు కొట్టాడు. అగ్రస్థానంలో మాత్రం భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని 42 విజయాలతో ఉన్నాడు. ఒకవేళ రోహిత్ శర్మ తన విజయాల పరంపరని ఇలాగే కొనసాగిస్తే.. ధోనీ రికార్డ్‌ని సైతం బద్దలు కొట్టే ఛాన్స్ ఉంది.

ఇదే సమయంలో రోహిత్ మరో రికార్డ్ కూడా సాధించాడు. ఒకే ఏడాదిలో అత్యధిక టీ20 మ్యాచుల్లో విజయాలను 2016లో ధోనీ (15) అందించగా.. రోహిత్ శర్మ దాన్ని సమం చేశాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు, నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. ఓపెనర్‌గా వచ్చిన కామెరూన్ గ్రీన్ (52), ఆ తర్వాత టిమ్ డేవిడ్ (54) అర్థశతకాలతో విజృంభించడం వల్లే.. ఆస్ట్రేలియా అంత స్కోరు చేయగలిగింది. ఇక భారత బౌలర్లలో అక్షర్ పటేల్ మూడు వికెట్లు తీసి, మరోసారి మెరిశాడు. ఇక 187 లక్ష్య చేధనతో బరిలోకి దిగిన భారత్.. మొదట్లో కాస్త తడబడింది. కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ వెనువెంటనే వెనుదిరిగారు. అయితే.. ఆ తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీ (63), సూర్యకుమార్ యాదవ్‌(69)ల విధ్వంసకర ఇన్నింగ్స్ పుణ్యమా అని భారత జట్టు గెలుపు దిశగా సాగింది. చివర్లో వచ్చిన హార్దిక్ పాండ్యా (25) విన్నింగ్ షాట్ కొట్టి.. భారత్‌ను గెలిపించాడు. దీంతో.. భారత్ 2-1 తేడాతో ఈ సిరీస్ నెగ్గింది.

Exit mobile version