Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్

  • లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో భారత్, ఇంగ్లండ్‌ మూడో వన్డే
  • తొలి రెండు మ్యాచ్‌ల్లో రాణించలేకపోయిన హిట్‌మ్యాన్‌
  • రోహిత్‌పై ఎలాంటి ఆందోళన అవసరం లేదు
Rohit Sharma Retirement

Rohit Sharma Retirement

Rohit Sharma Will Play Big Innings Said Morne Morkel: భారత్, ఇంగ్లండ్‌ మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ నేటితో ముగియనుంది. ఆదివారం (జులై 19) లండన్‌లోని చారిత్రాత్మక లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో ఈరోజు మధ్యాహ్నం మూడో వన్డే జరగనుంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో (11, 26 పరుగులు) ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన టీమిండియా సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మపై ప్రస్తుతం అందరి దృష్టి ఉంది. ఇదే సమయంలో లార్డ్స్ వన్డే హిట్‌మ్యాన్‌కు చివరి అంతర్జాతీయ మ్యాచ్ కావొచ్చనే ఊహాగానాలు కూడా జోరుగా వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలను బీసీసీఐ ఇప్పటికే ఖండించింది.

మూడో వన్డేకు ముందు జరిగిన మీడియా సమావేశంలో భారత బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ రోహిత్ శర్మకు పూర్తి మద్దతు ప్రకటించాడు. ‘కొత్త బంతితో బ్యాటింగ్ చేయడం ఈ సిరీస్‌లో ప్రతి ఓపెనర్‌కూ చాలా కష్టంగా ఉంది. ఇంగ్లండ్ పిచ్‌లపై బంతి బాగా స్వింగ్ అవుతుంది. దాంతో బ్యాటర్లు ఇబ్బంది పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో రోహిత్ శర్మ లాంటి సీనియర్ ఆటగాడు తిరిగి తన లయను అందుకుంటాడు. ఆ నమ్మకం నాకు ఉంది. రోహిత్ గతంలో ఎన్నోసార్లు ఇలాంటి సవాళ్లను ఎదుర్కొని విజయవంతంగా తిరిగి వచ్చాడు. అతనికి అపారమైన అనుభవం ఉంది. బ్యాటింగ్ విభాగంలో అతడు ఉండటం జట్టుకు ప్రశాంతతను ఇస్తుంది. అతడి ఫామ్ గురించి ఎలాంటి ఆందోళన అవసరం లేదు. త్వరలోనే పెద్ద ఇన్నింగ్స్ ఆడతాడు’ అని మోర్కెల్ ధీమా వ్యక్తం చేశాడు.

రెండో వన్డేలో భారత బౌలర్ల ప్రదర్శనపై కూడా మోర్కెల్ సంతృప్తి వ్యక్తం చేశాడు. ‘బౌలర్లు మంచి వేగంతో బంతులు వేయడంతో పాటు సరైన లైన్ అండ్ లెంగ్త్‌లో బౌలింగ్ చేశారు. ముఖ్యంగా ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్‌లను మిడిల్ ఓవర్లలో అదనపు బౌన్స్‌ను ఉపయోగించుకునేలా వ్యూహాత్మకంగా వినియోగించాము. అయితే కీలక సమయాల్లో వికెట్లు తీయడంలో మరింత మెరుగ్గా రాణించాల్సిన అవసరం ఉంది’ అని బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ చెప్పాడు.

ఇప్పటికే వన్డే సిరీస్ 1-1తో సమంగా ఉంది. దాంతో లార్డ్స్ వేదికగా జరిగే మూడో వన్డే ఉత్కంఠభరితంగా మారింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టే సిరీస్‌ను కైవసం చేసుకోనుంది. రోహిత్ శర్మ ఫామ్‌లోకి రావడం, భారత బ్యాటింగ్ విభాగం సమష్టిగా రాణించడం టీమిండియా విజయావకాశాలను మరింత పెంచనుంది. అభిమానులంతా కూడా హిట్‌మ్యాన్ నుంచి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌ను ఆశిస్తున్నారు.