NTV Telugu Site icon

Rishab Pant: కోలుకున్న రిషబ్ పంత్.. రోడ్డుప్రమాదం తర్వాత తొలిసారి ట్వీట్

Rishab Pant

Rishab Pant

Rishab Pant: టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ నెమ్మదిగా కోలుకుంటున్నాడు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ముంబైలోని ధీరూబాయ్ అంబానీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతడు యాక్సిడెంట్ తర్వాత తొలిసారి ట్వీట్ చేశాడు. తనకు జరిగిన శస్త్రచికిత్స విజయవంతమైందని, కోలుకునే ప్రక్రియ ఇప్పుడిప్పుడే మొదలైందని, మున్ముందు ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని రిషబ్ పంత్ అన్నాడు. తనకు అన్ని విధాలుగా అండగా నిలిచిన బీసీసీఐ, జై షా, ప్రభుత్వ యంత్రాంగానికి ధన్యవాదాలు అంటూ పంత్ తన ట్వీట్‌లో పేర్కొన్నాడు.

Read Also: Boinapally Vinod Kumar: రిమోట్‌ ఓటింగ్ విధానాన్ని బీఆర్‌ఎస్ వ్యతిరేకిస్తోంది..

కాగా జనవరి 7న ముంబైలోని కోకిలాబెన్ ధీరూబాయ్ అంబానీ ఆసుపత్రిలో రిషబ్ పంత్ మోకాలికి శస్త్ర చికిత్స నిర్వహించారు. అతడు మరో వారం రోజుల పాటు ఆసుపత్రిలోనే వైద్యుల పర్యవేక్షణలో ఉండబోతున్నాడు. రిషబ్ పంత్ వేగంగా కోలుకుంటున్నాడని.. డాక్టర్లు అతడి రిహాబ్ ప్రాసెస్‌ని మొదలెట్టారని బీసీసీఐ అధికారులు వెల్లడించారు. త్వరలో పంత్ వాకర్ ద్వారా నడవబోతున్నాడని.. కొన్నిరోజుల తర్వాత మళ్లీ తన కాళ్లపై నిలబడతాడని చెప్పారు. పంత్ పూర్తిగా కోలుకోవడానికి చాలా సుదీర్ఘ సమయం పడుతుందని తెలియజేశారు. కాగా పంత్ ఈ ఏడాదంతా క్రికెట్‌కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది జరిగే టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీకి కూడా రిషబ్ పంత్ అందుబాటులో ఉండడం అనుమానమేనని వార్తలు వస్తున్నాయి.

అటు పంత్ రోడ్డుప్రమాదానికి గురైన సమయంలో అతడిని కారు నుంచి బయటికి తీసుకురావడంలో హర్యానా రోడ్డు రవాణా సంస్థ డ్రైవర్‌తో పాటు ఇద్దరు స్థానిక యువకులు కీలకపాత్ర పోషించారు. పంత్ కారులో తమకు దొరికిన రూ.4 వేల నగదును ఆ యువకులు తిరిగి ఇచ్చేసి తమ నిజాయతీ చాటుకున్నారు. ఆ యువకులు ఇవాళ పంత్ ను ఢిల్లీ ఆసుపత్రిలో పరామర్శించడానికి వచ్చారు. దీనిపై పంత్ స్పందించాడు. ‘నేను ప్రతి ఒక్కరినీ వ్యక్తిగతంగా కలిసి కృతజ్ఞతలు చెప్పలేకపోవచ్చు. కానీ ఈ ఇద్దరు హీరోలకు నేను తప్పకుండా కృతజ్ఞతలు చెప్పాలి. యాక్సిడెంట్ అనంతరం వాళ్లిద్దరూ ఎంతో సాయపడ్డారు. నేను సకాలంలో సురక్షితంగా ఆసుపత్రికి చేరడంలో వాళ్ల సహకారం మరువలేనిది. రజత్ కుమార్, నిషు కుమార్.. మీ ఇద్దరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను’ అంటూ పంత్ భావోద్వేగభరిత ట్వీట్ చేశాడు.