Site icon NTV Telugu

Rinku Singh: టీ20 వరల్డ్ కప్‌కు ముందు.. వివాదంలో చిక్కుకున్న రింకూ సింగ్!

Karni Sena Rinku Singh

Karni Sena Rinku Singh

2026 టీ20 వరల్డ్ కప్‌కు ముందు టీమిండియా యువ క్రికెటర్‌, టీ20 క్రికెట్‌లో మ్యాచ్‌ ఫినిషర్‌గా పేరు తెచ్చుకున్న రింకూ సింగ్‌ వివాదంలో చిక్కుకున్నారు. రింకూ తన ఫేస్‌బుక్ ఖాతాలో కొన్ని రోజుల పోస్ట్ చేసిన ఏఐ జనరేటెడ్ వీడియోపై కర్ణిసేన తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేసింది. రింకూ సనాతన ధర్మానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని, పోలీసులు వెంటనే అతడిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కర్ణిసేన డిమాండ్ చేసింది. ఒకవేళ చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించింది. అలీగఢ్‌లోని సస్నీ గేట్ పోలీస్ స్టేషన్‌లో రింకూపై ఫిర్యాదు నమోదైంది.

రింకూ సింగ్ ఫేస్‌బుక్ వీడియోలో అతడు సిక్సర్లు బాదుతున్న దృశ్యాలతో పాటు, నిన్ను క్రికెటర్‌గా ఎవరు చేశారో తెలుసా? అనే టెక్స్ట్ ఉంది. హిందూ దేవుళ్లు విష్ణువు, శివుడు, గణేశుడు సన్‌గ్లాసెస్ పెట్టుకుని కారులో కూర్చున్నట్లు.. ఆ కారును హనుమంతుడు డ్రైవ్ చేస్తున్నట్లు ఏఐ వీడియోను రింకూ క్రియేట్ చేశారు. ఇదే ఇప్పుడు వివాదానికి కారణమైంది. దేవుడి అనుగ్రహంతోనే తన విజయం సాధ్యమైందనే ఉద్దేశంతో రింకూ ఆ వీడియో పోస్ట్ చేసినా.. కొందరు అభ్యంతరకరంగా భావిస్తున్నారు. ఈ వీడియోపై కర్ణిసేన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. హిందూ మత భావాలను కించపరిచారంటూ రింకూపై ఫిర్యాదు దాఖలు చేసింది. కర్ణిసేన జిల్లా అధ్యక్షుడు సుమిత్ తోమర్ మాట్లాడుతూ.. రింకూ సింగ్ షారుక్ ఖాన్‌లాగే జిహాదీ మనస్తత్వాన్ని ప్రదర్శించాడని ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేవుళ్లకు నల్ల కళ్లజోడు పెట్టడం, థార్ కారులో చూపించడం, ఇంగ్లిష్ పాటలకు డ్యాన్స్ చేస్తున్నట్లు చూపించడం మాత విశ్వాసంతో ఆటలాడటమే అని పేర్కొన్నారు.

Also Read: Shah Rukh Khan-Don 3: ‘డాన్ 3’ కోసం షారుక్‌ కండిషన్.. మరో డైరెక్టర్ అంటే పర్హాన్ అక్తర్ ఒప్పుకుంటాడా?

అలీగఢ్‌లోని సస్నీ గేట్ పోలీస్ స్టేషన్‌లో రింకూపై ఫిర్యాదు నమోదైంది. స్టేషన్ ఇన్‌చార్జ్ దైనిక్ భాస్కర్‌కు ఇచ్చిన సమాచారం ప్రకారం.. ఆ వీడియో నిజంగా ఎవరు పోస్ట్ చేశారో, దాని ప్రామాణికత ఏమిటో ముందుగా విచారిస్తామని చెప్పారు. అన్ని అంశాలు ధృవీకరించిన తర్వాతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కర్ణిసేనకు తెలిపారు. రింకూ ప్రస్తుతం నాగ్‌పూర్‌లో ఉన్నారు. న్యూజిలాండ్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు సిద్ధమవుతున్నారు. ఆ వెంటనే ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌లో పాల్గొననున్నారు. కీలక వరల్డ్ కప్‌కు ముందు ఈ వివాదం ఎంతవరకు ప్రభావం చూపుతుందో చూడాలి.

Exit mobile version