Site icon NTV Telugu

Ricky Ponting: కోలుకున్న పాంటింగ్.. మళ్లీ మైక్ పట్టిన ఆసీస్ దిగ్గజం

Ricky Ponting

Ricky Ponting

Ricky Ponting: ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ కోలుకున్నాడు. శుక్రవారం నాడు ఆస్ట్రేలియా, వెస్టిండీస్ టెస్టు మ్యాచ్ జరుగుతున్న సందర్భంగా కామెంటరీ చేస్తుండగా ఛాతీలో నొప్పి రావడంతో పాంటింగ్‌ను ఆసుప్రతికి తరలించారు. దీంతో అతని అభిమానులు ఆందోళనకు గురయ్యారు. గుండెపోటు వచ్చిందనే వార్తలు రావడంతో మరింత కంగారుపడ్డారు. అయితే ప్రస్తుతం పాంటింగ్ పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యాడు. శనివారం అతడు మళ్లీ మైదానంలోకి దిగి కామెంటరీ మొదలుపెట్టాడు. ఈ మేరకు ఓ వీడియోను కూడా షేర్ చేశాడు.

Read Also: Tirumala: భక్తులకు అలర్ట్.. ఆధార్ కార్డు ఉంటేనే వైకుంఠద్వార దర్శనం

ఛాతిలో నొప్పి వస్తోందని చెప్పిన 15 నిమిషాల్లోనే తనను ఆసుపత్రిలో చేర్పించి, చికిత్స అందించారని పాంటింగ్ చెప్పాడు. తాను బాగానే ఉన్నానని, నలతగా అనిపించడంతో ముందు జాగ్రత్తగా పరీక్షల కోసం హాస్పిటల్‌కు వెళ్లానని సహచర కామెంటేటర్లకు వివరించాడు. ఆస్ట్రేలియా, వెస్టిండీస్ టెస్ట్ మ్యాచ్ నాలుగో రోజు శనివారం నాడు ఆట ప్రారంభానికి ముందు ప్రీ మ్యాచ్ షోలో పాంటింగ్ కనబడటంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. 2012లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన అనంతరం పాంటింగ్ కామెంటేటర్‌గా సేవలు అందిస్తున్నాడు. టెస్టుల్లో ఆస్ట్రేలియా తరఫున అత్యధిక శతకాలు బాదిన ఆటగాడిగా పాంటింగ్ రికార్డు నెలకొల్పాడు. ప్రపంచ క్రికెట్‌లోనే అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా పాంటింగ్ నిలిచాడు. 324 మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియాకు కెప్టెన్‌గా వ్యవహరించిన రికీ పాంటింగ్ 220 మ్యాచ్‌ల్లో జట్టును గెలిపించాడు. అతడి విజయాల శాతం 67.91గా నమోదు కావడం గమనించాల్సిన విషయం.

Exit mobile version