NTV Telugu Site icon

IPL 2022: కోహ్లీ హాఫ్ సెంచరీ.. ఆర్సీబీ ప్లేఆఫ్స్ ఆశలు సజీవం

Kohli

Kohli

ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా ప్లే ఆఫ్స్ ఆశలను ఆ జట్టు సజీవంగా ఉంచుకుంది.  ఆర్సీబీ విజయంతో హైదరాబాద్, పంజాబ్ జట్లు మాత్రం ప్లేఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించాయి. దీంతో ఈ రెండు జట్లు 22న తమ చివరి మ్యాచ్‌లో నామమాత్రంగా తలపడనున్నాయి.

ఈ రోజు జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ విధించిన 169 పరుగుల లక్ష్యంతో బెంగళూరు బరిలోకి దిగగా .. ఓపెనర్లు కోహ్లీ (73), డుప్లెసిస్‌ (44) పరుగులు చేసి జట్టును విజయం వైపు నడిపించారు. దీంతో వికెట్లేమీ కోల్పోకుండానే ఆర్సీబీ మ్యాచ్ గెలిచేలా కనిపించింది. అయితే రషీద్ ఖాన్ తన బౌలింగ్‌తో మాయ చేయడంతో డుప్లెసిస్ అవుటయ్యాడు.

అనంతరం కాసేపటికే ఊపు మీద ఉన్న కోహ్లీని కూడా రషీద్ ఖాన్ బోల్తా కొట్టించాడు. రషీద్ వేసిన బంతిని భారీ సిక్సర్‌గా మలిచిన కోహ్లీ.. తర్వాతి బంతిని కూడా ముందుకొచ్చి బౌండరీకి తరలించడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో బంతిని మిస్ అవడంతో సాహా స్టంప్ అవుట్ చేశాడు. ఓపెనర్లు అవుట్ కావడంతో క్రీజులోకి వచ్చిన మాక్స్‌వెల్ (40నాటౌట్) ఎడాపెడా బౌండరీలు కొట్టి ఆర్సీబీని గెలిపించాడు. కాగా ప్లే ఆఫ్స్‌కు ముందు కింగ్ కోహ్లీ ఫాంలోకి రావడం ఆర్సీబీ జట్టుకు కలిసొచ్చే అంశం.