Site icon NTV Telugu

Ravichandran Ashwin: భారత్‌పై ఆ వ్యాఖ్యలు సరైనవి కావు.. రికీ పాంటింగ్‌కి కౌంటర్

Ashwin Counter To Ponting

Ashwin Counter To Ponting

Ravichandran Ashwin Counter To Ricky Ponting: ప్రస్తుత టీ20 వరల్డ్‌కప్ మెగాటోర్నీలో విరాట్ కోహ్లీ ఎంత అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడో అందరికీ తెలుసు! ఒక్క సౌతాఫ్రికా మ్యాచ్ మినహాయిస్తే.. మిగతా మ్యాచెస్‌లో అర్థశతకాలతో చెలరేగాడు. ఈ నేపథ్యంలోనే అతనిపై ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు రికీ పాంటింగ్ పొగడ్తల వర్షం కురిపిస్తూ.. టీమిండియాని తక్కువ చేసి మాట్లాడాడు. ఇప్పటివరకు భారత జట్టు తమ అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించలేదని, కేవలం కోహ్లీ ఒక్కడే ఇరగదీశాడని పేర్కొన్నాడు. టీమిండియా విజయాలు సాధించాలంటే.. కోహ్లీ తప్పకుండా ఆడాల్సిన పరిస్థితి నెలకొందని పాంటింగ్ వ్యాఖ్యానించాడు.

ఈ వ్యాఖ్యలపై రవిచంద్రన్ అశ్విన్ పరోక్షంగా స్పందిస్తూ.. రికీ పాంటింగ్‌కి కౌంటర్ వేశాడు. ‘‘ఇప్పుడు ఆడుతున్న టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో కొన్ని మ్యాచుల్లో చివరివరకు పోరాడాల్సి వచ్చింది. బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌లతో జరిగిన మ్యాచ్‌లు చివరివరకూ ఉత్కంఠభరితంగా సాగాయి. ఇప్పటికీ మేము ప్రతీ మ్యాచ్ నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాం. టీ20 ఫార్మాట్‌లో ఎప్పుడు, ఎలాంటి మలుపులు చోటు చేసుకుంటాయో ఎవ్వరూ పసిగట్టలేరు. చిన్న మార్జిన్‌తోనే మ్యాచ్ ఫలితం మారిపోతుంటుంది. గతంలో ఎంతోమంది నిపుణులు, మాజీలు సైతం అలాంటి అభిప్రాయాల్ని వెల్లడించారు. అయితే.. మా జట్టు ప్రదర్శన సరిగ్గా లేదని వ్యాఖ్యలు చేయడం మాత్రం సరైనది కాదు. మ్యాచ్ పరిస్థితిని బట్టి, ఆటతీరుని కొనసాగించాల్సి ఉంటుంది’’ అంటూ అశ్విన్ చెప్పుకొచ్చాడు.

ఇదిలావుండగా.. రెండో గ్రూప్‌లో భారత జట్టు 6 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. అయినప్పటికీ సెమీస్‌లో బెర్త్ కన్ఫమ్ చేసుకోవాలంటే.. జింబాబ్వేతో జరిగే మ్యాచ్‌ని తప్పకుండా గెలవాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ మ్యాచ్ ఓడిపోతే.. సెమీస్ అవకాశాలు కష్టాల్లో పడతాయి. ఎందుకంటే.. భారత్‌తో పోలిస్తే, పాకిస్తాన్ రన్ రేట్ మెరుగ్గా ఉంది. ఒకవేళ జింబాబ్వే చేతిలో భారత్ ఓడిపోయి, బంగ్లాదేశ్ జట్టుపై పాకిస్తాన్ మంచి స్కోరుతో గెలిస్తే.. రన్ రేట్ ఆధారంగా భారత్‌ని పాక్ వెనక్కి నెడుతుంది. అప్పుడు సెమీస్ నుంచి భారత్ నిష్క్రమించినట్టే! అటు, సౌతాఫ్రికా పరిస్థితి కూడా గందరగోళంగానే ఉన్నా, నెదర్లాండ్స్ జట్టు చిన్నదే కాబట్టి, దానిపై అది పైచేయి సాధించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Exit mobile version