NTV Telugu Site icon

Ravichandran Ashwin: అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఆ బంతి వైడ్ కాకుంటే క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేవాడిని..!!

Ravichandran Ashwin

Ravichandran Ashwin

Ravichandran Ashwin: గత ఆదివారం టీ20 ప్రపంచకప్‌లో భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్ అభిమానులను ఉత్కంఠకు గురిచేసింది. ఈ మ్యాచ్ చివరి బంతి వరకు అభిమానులను మునివేళ్లపై నిలబెట్టింది. ఇన్నింగ్స్ చివరి బంతికి రవిచంద్రన్ అశ్విన్ షాట్ కొట్టడంతో టీమిండియా చిరస్మరణీయ విజయం నమోదు చేసింది. దీంతో భారత అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే చివరి ఓవర్‌లో ఐదో బంతిని అశ్విన్ ఆడకుండా వదిలేయడంతో అది వైడ్‌గా వెళ్లింది. ఒకవేళ బంతి మలుపు తిరిగి ప్యాడ్లను తాకి ఉంటే ఏం జరిగి ఉండేదో తాజాగా అశ్విన్ వివరించాడు. ఈ సందర్భంగా అతడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత చాలా మంది అభిమానులు, విశ్లేషకులు ఇదే ప్రశ్న తనను అడిగారని.. మహ్మద్ నవాజ్ వేసిన బంతి వైడ్‌గా వెళ్లకుండా నేరుగా తన ప్యాడ్లను తాకి ఉంటే నేరుగా డ్రెస్సింగ్‌ రూంలోకి వెళ్లిపోయేవాడిని అని అశ్విన్ తెలిపాడు. వెంటనే ఫోన్‌ చేతిలోకి తీసుకుని తాను ఇంతటితో క్రికెట్‌ కెరీర్‌ ముగిస్తున్నట్లు రిటైర్మెంట్‌ను ట్విట్టర్‌లో ప్రకటించేవాడిని అని నవ్వుతూ పేర్కొన్నాడు.

Read Also: Human Washing Machine: బట్టలనే కాదు.. ఈ వాషింగ్ మెషిన్ మనుషులను కూడా ఉతుకుతుంది..!!

కాగా భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌ను ఇరుదేశాల ప్రజలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. ఆటగాళ్లు ఏ మాత్రం రాణించకపోయినా వారి ఇళ్లపై అభిమానులు దాడులు చేస్తారు. గతంలో ఎన్నోమార్లు ఈ విషయం నిరూపితమైంది. ఇటీవల జరిగిన మ్యాచ్‌లో కూడా ఇరుదేశాల అభిమానుల భావోద్వేగాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాకిస్థాన్ ఓడిపోగానే ఆ దేశంలో పలువురు అభిమానులు ఆగ్రహంతో టీవీలను పగులకొట్టిన వార్తలను విన్నాం. ఒకవేళ భారత్ ఓడిపోయి ఉంటే మన దేశంలో కూడా సేమ్ సీన్ కనిపించేంది. చివరి ఓవర్ చివరి బంతికి రెండు పరుగులు అవసరమైన సమయంలో అశ్విన్‌ నవాజ్‌ వేసిన బంతి వైడ్‌ అవుతుందని గ్రహించి దానిని వదిలేశాడు. దీంతో ఆఖరి బంతిని లాఫ్టెడ్‌ షాట్‌కు కొట్టి మ్యాచ్‌ను గెలిపించాడు.