ఫేలవ ఫామ్, గాయం కారణంగా కొంతకాలం భారత జట్టుకు దూరంగా ఉన్న హార్దిక్ పాండ్యా.. ఐపీఎల్ అదరగొట్టి, తిరిగి జట్టులో చోటు దక్కించుకున్నాడు. కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి ప్రయత్నంలోనే తన జట్టుకి ఐపీఎల్ అందించిన హార్దిక్.. ఆల్‌రౌండర్‌గానూ మంచి ప్రదర్శన కనబరిచాడు. 15 మ్యాచ్‌లు ఆడిన అతడు.. 487 పరుగులు చేయడంతో పాటు 8 వికెట్లు తీశాడు. ఇంత మంచి పెర్ఫార్మెన్స్ కనబర్చినందుకే స్వదేశంలో సౌతాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్‌కి హార్దిక్ ఎంపికయ్యాడు. ఈ క్రమంలోనే అతనిపై భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.
‘‘భారత జట్టులోకి హార్దిక పునరాగమనం ఇవ్వడం నిజంగా మంచి విషయం. అతడు బ్యాట్స్మన్‌గా లేదా ఆల్‌రౌండర్‌గా జట్టులో చోటు దక్కించుకున్నాడు. అయితే.. అతడు గాయం నుంచి పూర్తి కోలుకున్నా, 2 ఓవర్లు వేయడానికి ఇబ్బంది పడుతున్నాడు. జట్టుకు కొన్నాళ్లు దూరంగా ఉండటంతో, అతనికి మంచి విశ్రాంతి లభించింది. ఇకపై కూడా హార్దిక్‌కి విశ్రాంతి అనేది చాలా అవసరం. టీ20 వరల్డ్‌కప్‌లో హార్దిక్ రాణించాలంటే, అప్పటివరకూ తగినంత రెస్ట్ అతనికి కావాలి. ఆలోపు అతను వన్డేలకు దూరంగా ఉంటేనే బెటర్. టీ20 ప్రపంచకప్‌కు హార్దిక్ ఫిట్‌గా ఉండడం భారత్‌కు చాలా ముఖ్యం. ఫిట్‌గా ఉంటే, అతనొక్కడే ఇద్దరి ఆటగాళ్లతో సమానం. బ్యాటింగ్ ఆర్డర్‌లో ఏ పొజిషన్‌లో అయినా.. హార్దిక్ అద్భుతంగా ఆడగలడు’’ అని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు.