టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ మంచి ఫినిషర్ అనే ముద్ర వేయించుకున్నాడు. అతడు రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత ఇప్పటివరకు ధోనీ తరహాలో ఆడే ఫినిషర్ కోసం టీమిండియా గాలిస్తూనే ఉంది. అయితే తాజాగా టీమిండియాకు ధోనీ తర్వాత మరో ఫినిషర్ దొరికేశాడని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్‌లో ఆర్సీబీ తరఫున ఫినిషింగ్ ఇన్నింగ్స్‌లు ఆడిన దినేష్ కార్తీక్ ధోనీ స్థానంలో ఫినిషర్ రోల్ పోషించగలడని తెలిపాడు. టీ20 ప్రపంచకప్‌లో దినేష్ కార్తీక్ జట్టుకు మంచి ప్రత్యామ్నాయం అని రవిశాస్త్రి ఆకాంక్షించాడు.
అయితే దినేష్ కార్తీక్ వికెట్ కీపర్ కావడం.. ఇప్పటికే టీమిండియాలో వికెట్ కీపర్‌గా పంత్ తన స్థానం పదిలం చేసుకోవడం అన్న అంశాలను పరిగణనలోకి తీసుకుంటే జట్టు ఎంపిక కెప్టెన్‌కు భారం కానుంది. ఈ నేపథ్యంలో బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందే బ్యాటింగ్ చేసే కీపర్ కావాలా? లేదా ఫినిషర్‌గా బ్యాటింగ్ చేసే కీపర్ కావాలా అన్న విషయం టీమ్ మేనేజ్‌మెంట్ ఆలోచించుకోవాలని రవిశాస్త్రి హితవు పలికాడు. ఒకవేళ ఇద్దరినీ తుదిజట్టులో ఆడించాలని భావిస్తే పంత్‌ను బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందు పంపించి.. దినేష్ కార్తీక్‌ను ఫినిషర్‌లా వాడుకోవాలని రవిశాస్త్రి సూచించాడు.
IND vs WI 2nd T20 : చివరి ఓవర్ లో సిరీస్ కైవసం… భారత్ సరికొత్త రికార్డు
ధోనీ జట్టును వీడాక మనకు ఎక్కువ మంది ఫినిషర్లు దొరకలేదని రవిశాస్త్రి అన్నాడు. కాబట్టి మ్యాచ్ ఫినిష్ చేయగల ఆటగాడు టీమిండియాకు కావాలని.. కాబట్టి టీ20 ప్రపంచకప్ సందర్భంగా దినేష్ కార్తీక్‌కు ఫినిషర్ రోల్‌లో ఆడడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భావిస్తున్నట్లు రవిశాస్త్రి పేర్కొన్నాడు. కాగా ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచకప్‌లో స్థానం దక్కించుకోవాలంటే ముందుగా దినేష్ కార్తీక్ దక్షిణాఫ్రికాతో జరగబోయే టీ20 సిరీస్‌లో సత్తా చాటాల్సిన అవసరం ఉందని రవిశాస్త్రి తెలిపాడు.
