ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందే రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) శిబిరంలో కెప్టెన్సీ అంశం హాట్ టాపిక్‌గా మారింది. మాజీ కెప్టెన్ సంజూ శాంసన్ అనంతరం నాయకత్వ బాధ్యతలు ఎవరు చేపడతారనే దానిపై అటు అభిమానుల్లోనూ, ఇటు క్రికెట్ వర్గాల్లోనూ జోరుగా చర్చ జరుగుతోంది. యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్ పేర్లు ముందుకొస్తున్నప్పటికీ.. సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజానే తదుపరి కెప్టెన్‌గా ఉండాలంటూ పలువురు మాజీ క్రికెటర్లు, ఫ్యాన్స్ అంటున్నారు. ఈ స్పెక్యులేషన్ల మధ్య రాజస్థాన్ తాజాగా చేసిన సోషల్ మీడియా పోస్టు ఒకటి అభిమానుల్లో మరోసారి ఉత్కంఠను పెంచింది.
రాజస్థాన్ రాయల్స్ తన ఎక్స్‌లో రవీంద్ర జడేజా ఫొటోను పంచుకును.. ‘దళపతి’ అనే కాప్షన్ ఇచ్చింది. దాంతో రాయల్స్‌ను నడిపించేది జడేజానే అని ఖాయమైంది. చెన్నై సూపర్ కింగ్స్‌తో ట్రేడ్ డీల్‌లో భాగంగా జడేజా రాయల్స్‌లో చేరిన విషయం తెలిసిందే. ఐపీఎల్ 2025 ఆవరకు రాజస్థాన్‌కు కెప్టెన్‌గా ఉన్న సంజు శాంసన్ చెన్నైకి వెళ్లిపోయాడు. జడేజా 2008–09 మధ్యలో రాజస్థాన్ తరఫున ఆడిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ ఆ ఫ్రాంచైజీలోకి రావడమే కాదు.. కెప్టెన్సీ కూడా దక్కించుకున్నాడు.
ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ హోం మ్యాచ్‌ల వేదిక విషయంలోనూ కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) స్టేడియం రాయల్స్ హోం గ్రౌండ్‌గా మారే అవకాశాలు ఉన్నాయి. గత నవంబర్‌లో ఐఏఎన్‌ఎస్ కథనం ప్రకారం.. రాయల్స్‌తో పాటు డిఫెండింగ్ చాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా పుణె వేదికపై ఆసక్తి చూపాయి. అయితే తాజా పరిణామాల ప్రకారం పుణె హోం వెన్యూ దాదాపుగా రాయల్స్‌కే దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆర్ఆర్ యాజమాన్యం స్టేడియం తనిఖీలు, సమీప సదుపాయాలపై ప్రాథమిక పరిశీలన కూడా పూర్తి చేసినట్లు తెలుస్తోంది. సంస్థాగత కారణాల వల్లే రాయల్స్ తమ ప్రధాన హోం గ్రౌండ్ అయిన జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియం నుంచి కొన్ని మ్యాచ్‌లను బయట వేదికలకు తరలించాల్సి వస్తోంది. రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్‌తో నెలకొన్న వివాదాలు ఇందుకు ప్రధాన కారణం.
