దక్షిణాఫ్రికాతో సిరీస్ కోసం భారత తుది జట్టుని ప్రకటించడం వరకూ.. జమ్మూ కశ్మీర్ పేసర్ ఉమ్రాన్ మాలిక్ టీమిండియాలో స్థానంపై కొంత వివాదమైతే నెలకొంది. అతడు అద్భుతంగా బౌలింగ్ వేస్తోన్నా, వేగంగా బంతులు విసురుతూ బ్యాట్స్మన్లను ముప్పుతిప్పలు పెడుతున్నా.. ఎందుకు భారత జట్టులో చోటివ్వడం లేదని విమర్శలు వెల్లువెత్తాయి. మాజీలు సహా, పాకిస్థాన్ వాళ్లూ పెదవి విరిచారు. అనుభవం పేరుతో కావాలనే అతడ్ని జట్టులో తీసుకోవడం లేదని మండిపడ్డారు. చివరికి ఆ విమర్శలకి చెక్ పెడుతూ.. అతనికి టీమిండియాలో చోటు కల్పించారు. సౌతాఫ్రికాతో జరగబోయే టీ20 సిరీస్‌లో అతడు ఆడనున్నాడు.
అయితే.. అతనికి వెంటనే జట్టులో చోటు దక్కకపోవచ్చని కోచ్ ద్రవిడ్ సంకేతాలు ఇవ్వడం చర్చనీయాంశమవుతోంది. ‘‘ఉమ్రాన్ మంచి వేగంతో బౌలింగ్ వేస్తున్నాడు. అతడిలో మంచి పేస్ ఉంది. అయితే, అతడు ఇంకా నేర్చుకుంటున్నాడు. ఉమ్రాన్ ఇంకా కుర్రాడే. రోజురోజుకూ మెరుగవుతున్నాడు. ఆడుతున్నకొద్దీ ఇంకా మంచి బౌలర్ అవుతాడు. మాకైతే అతడు జట్టులో ఉన్నందుకు సంతోషంగానే ఉంది కానీ, ఉమ్రాన్‌కి ఎన్ని మ్యాచ్‌లు ఆడే అవకాశం ఇవ్వగలమో చూడాలి’’ అని కుండబద్దలు కొట్టాడు. భారత జట్టు చాలా పెద్దదని, అందరికీ తుది జట్టులో చోటివ్వడం కుదరదని అన్నాడు. అర్ష్‌దీప్ రూపంలో మరో చక్కని యువ పేసర్ దొరికాడని తెలుపుతూ.. ఆ ఇద్దరిలో ఎవరికీ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారన్న విషయంపై సస్పెన్స్‌లో పెట్టేశాడు. క్రికెట్ నిపుణుల ప్రకారం.. నెట్స్‌లో ఉమ్రాన్ కంటే అర్ష్‌దీప్ బాగా రాణిస్తున్నాడని, అతనికే జట్టులో చోటు దక్కే అవకాశం ఉందని అంటున్నారు.
ఇక ఇదే సమయంలో హార్దిక్ పాండ్యా పునరాగమనం ఇవ్వడంపై రాహుల్ ద్రవిడ్ సంతోషం వ్యక్తం చేశాడు. ‘‘హార్దిక్ తిరిగి జట్టులోకి వచ్చినందుకు సంతోషంగా ఉంది. అతడో అద్భుతమైన క్రికెటర్. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో విశేషంగా రాణించాడు. టీ20 లీగ్‌లోనూ గొప్ప ఫామ్‌ను ప్రదర్శించాడు. అతని కెప్టెన్సీ గొప్పగా ఉంది. మళ్లీ హార్దిక్ బౌలింగ్ వేస్తుండడం మాకు సానుకూలాంశం’’ అని ద్రవిడ్ అన్నాడు.