NTV Telugu Site icon

Rahul Dravid: రిషభ్ పంత్‌ కెప్టెన్సీపై అప్పుడే లెక్కలేస్తే ఎలా?

Dravid On Rishabh Pant

Dravid On Rishabh Pant

దక్షిణాఫ్రితో టీ20 సిరీస్‌లో భారత జట్టుకు రిషభ్ పంత్ నాయకత్వ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే! అయితే, అతడు సమర్థవంతంగా జట్టుని నడిపించలేకపోయాడని విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా.. మొదట్లో రెండు మ్యాచ్‌లు ఘోరంగా ఓడిపోవడంతో, అతడి కెప్టెన్సీని అందరూ తప్పుపట్టారు. ఎలాంటి నాయకత్వ లక్షణాలు అతనిలో లేవని, రిషభ్ స్థానంలో ఓ సీనియర్ ఆటగాడ్ని కెప్టెన్‌గా ఎంపిక చేయాలని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. తొలి రెండు ఓటముల తర్వాత భారత్ రెండు మ్యాచ్‌లు కైవసం చేసుకున్నా.. అందులో రిషభ్ ప్రతిభ ఏం లేదని, ఆటగాళ్లు బాగా రాణించడం వల్లే సిరీస్ సమం అయ్యిందంటూ కామెంట్స్ వచ్చిపడ్డాయి.

ఈ నేపథ్యంలోనే కోచ్ రాహుల్ ద్రవిడ్ అతనికి మద్దతు ఇచ్చాడు. ఒక్క సిరీస్‌తోనే రిషభ్ కెప్టెన్సీపై లెక్కలు వేయడం కరెక్ట్ కాదని అన్నాడు. ‘‘సిరీస్‌ను 0-2 నుంచి 2-2 వరకు తీసుకురావడం నిజంగా మెచ్చుకోదగిన విషయం. కెప్టెన్సీ అంటే.. కేవలం గెలుపోటములే కాదు. రిషభ్ ఇంకా యువ సారథి. అతడు నాయకుడిగా మెరుగుపడుతున్నాడు. అతడి విషయంలో అప్పుడే తీర్పు ఇచ్చేయడం తొందరపాటు చర్యే అవుతుంది. ఒక్క సిరీస్‌తోనే అలా మార్పులు చేయకూడదు. అతడిపై ఎంతో ఒత్తిడి ఉంది. కానీ, ఆ అనుభవం నుంచి నేర్చుకుంటున్నాడు. 0-2 స్థాయి నుంచి జట్టును 2-2 స్థాయికి తీసుకెళ్లడం పట్ల రిషభ్‌ని అభినందించాల్సిందే’’ అని ద్రవిడ్ చెప్పుకొచ్చాడు.