Site icon NTV Telugu

టీమిండియా హెడ్‌ కోచ్‌ రాహల్‌ ద్రవిడ్‌ రికార్డు ఇవే !

team India news coach

టీమిండియా కొత్త కోచ్‌గా.. భారత మాజీ క్రికెటర్‌, మిస్టర్‌ వాల్‌ రాహుల్‌ ద్రావిడ్‌ బాధ్యతలు చేపట్టనున్నాడు. ఇప్పటికే, అండర్‌-19, భారత్‌-ఏ జట్లపై.. అత్యుత్తమమైన కోచ్‌గా చెరగని ముద్ర వేసిన రాహుల్‌… ఇకపై భారత్‌ జట్టుకు ప్రధాన కోచ్‌గా వ్యవహరించనున్నాడు. అండర్‌-19 జట్టును ఒకసారి రన్నరప్‌గా… మరోసారి విశ్వవిజేతగా నిలిపాడు ద్రవిడ్‌. టీ20 ప్రపంచకప్‌ తర్వాత.. ప్రస్తుత కోచ్‌ రవిశాస్త్రి పదవీ కాలం ముగియనుండటంతో.. తదుపరి కోచ్‌ కోసం దరఖాస్తులు ఆహ్వానించింది బీసీసీఐ. అయితే, దీనికి రాహుల్‌ ద్రవిడ్‌ ఒక్కడే దరఖాస్తు చేసుకోవడంతో… ఈ పదవి అతన్నే వరించింది.

కానీ, హెడ్‌కోచ్‌ పదవిని చేపట్టేందుకు రాహుల్‌ పెద్దగా ఆసక్తి చూపలేదు. బీసీసీఐ చీఫ్‌ సౌరవ్‌ గంగూలీ.. నచ్చజెప్పడంతో ద్రవిడ్‌ ఒప్పుకున్నట్టు సమాచారం. యువ క్రికెటర్ల ఆటతీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించి…మెళుకువలు చెప్పే ద్రవిడ్‌.. వాళ్లకు సహజసిద్ధంగా ఆడే స్వేచ్చనిస్తాడనే పేరుంది. చివరి అండర్‌-19 ప్రపంచకప్‌లో ప్రియమ్‌గార్గ్‌ జట్టుకూ సలహాలు ఇచ్చాడు. ఆటగాళ్లు మైదానంలోకి అడుగుపెట్టే ముందు.. పెట్టిన తర్వాత.. ఎలాంటి వైఖరితో ఉండాలో.. మానసిక స్థితి ఎలా ఉండాలో ప్రత్యేకంగా వివరిస్తాడు.

అందుకే రాహుల్ ద్రవిడ్‌ను…ఎంతో మంది స్వదేశీ ఆటగాళ్లతో పాటు విదేశీ ఆటగాళ్లు ఇష్టపడతారు. ఒక రకంగా టీమిండియా రిజర్వ్‌ బెంచ్‌ పటిష్టంగా ఉండటానికి కారణం రాహుల్ ద్రవిడే కారణమని చెప్పొచ్చు. ప్రస్తుతం టీమ్‌లో ఉన్న రిషబ్‌ పంత్‌, అజింక్య రహానే, అండర్‌19 విన్నింగ్‌ కెప్టెన్‌ పృథ్వీ షాలు…ద్రవిడ్‌ ఇచ్చిన సలహాలతోనే రాణించారు. 1973, జనవరి 11న ఇండోర్‌లో జన్మించిన రాహుల్‌ ద్రవిడ్‌.. 1996 నుంచి 2012 వరకు భారత్‌ క్రికెట్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. ఎన్నోసార్లు జట్టును ఓటమి అంచుల నుంచి గట్టెక్కించి.. టీమ్‌లో ది వాల్‌గా పేరు సంపాదించాడు. టీమిండియా కెప్టెన్‌గానూ తనదైన ముద్రవేశాడు.

1996లో అరంగేట్రం చేసిన రాహుల్‌ మొత్తంగా.. 164 టెస్టులాడి 52.3 యావరేజ్‌తో, 42.3 స్ట్రయిక్‌ రేట్‌తో 13వేల 288 పరుగులు చేశాడు. వన్డేల్లో 344 మ్యాచ్‌లు ఆడిన ద్రవిడ్‌ 39.2 యావరేజ్‌తో 71.2 స్ట్రయిక్‌ రేట్‌తో 10వేల 889 రన్స్‌ సాధించాడు. 2011లో ఒకే ఒక్క టీ20 ఆడిన మిస్టర్‌ వాల్‌.. 147.6 స్ట్రయిర్‌ రేట్‌, 31.0 యావరేజ్‌తో… 31 పరుగులు చేశాడు. 2011లో వన్డేలకు, 2012లో టెస్టులకు గుడ్‌బై చెప్పాడు రాహుల్‌ ద్రవిడ్‌. ఐపీఎల్‌లోనూ సత్తా చాటాడు రాహుల్‌ ద్రవిడ్‌. రాజస్థాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌గా వ్యవహరించాడు. 89 మ్యాచ్‌లు ఆడి.. 28.2 యావరేజ్‌తో, 115.5 స్ట్రయిక్‌ రేట్‌తో 2174 రన్స్‌ సాధించాడు. మొత్తం ఐదు సీజన్లు ఆడిన ద్రవిడ్‌.. 2013లో ఐపీఎల్‌కు కూడా గుడ్‌బై చెప్పాడు.

Exit mobile version