భారత జట్టు మాజీ ఆటగాడు, మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్ టీమిండియా ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టడం దాదాపుగా ఖరారైంది. ఇటీవల నేషనల్ క్రికెట్ అకాడమీ హెడ్ పదవికి రాజీనామా చేసిన అతడు… మంగళవారం నాడు టీమిండియా హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు సమర్పించాడు. ద్రవిడ్‌తో పాటు అతడి సన్నిహితుడు పరాస్ మాంబ్రే బౌలింగ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్నాడు. మరోవైపు ఫీల్డింగ్ కోచ్ పదవికి భారత మాజీ క్రికెటర్, హర్యానాకు చెందిన వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ అజయ్ రత్రా దరఖాస్తు సమర్పించాడు. కాగా బ్యాటింగ్ కోచ్‌గా మాత్రం ప్రస్తుతం ఉన్న విక్రమ్ రాథోడ్ కొనసాగే అవకాశాలున్నాయి.
Read Also: పాకిస్థాన్‌పై ఇండియా ఎందుకు ఓడిపోయిందో చెప్పిన సచిన్
కాగా ప్రస్తుతం టీమిండియా కోచ్‌గా కొనసాగుతున్న రవిశాస్త్రి 2017 ఛాంపియన్స్ ట్రోఫీ అనంతరం బాధ్యతలు చేపట్టాడు. దాదాపుగా నాలుగేళ్లుగా అతడు భారత జట్టుకు తన సేవలు అందిస్తున్నాడు. విచిత్రమేమిటంటే.. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో పాకిస్థాన్ చేతిలో భారత్ ఓడిపోయిన తర్వాత కోచ్ పదవీ బాధ్యతలను చేపట్టిన రవిశాస్త్రి… ప్రస్తుతం టీ20 ప్రపంచకప్‌లో మళ్లీ పాకిస్థాన్ చేతిలో భారత్ ఓటమి తర్వాత కోచ్ పదవిని వీడుతుండటం గమనార్హం. కొత్త కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ టీ20 ప్రపంచకప్ ముగిసిన అనంతరం బాధ్యతలు చేపట్టే అవకాశముంది. తొలుత టీమిండియా కోచ్ పదవి చేపట్టేందుకు ద్రవిడ్ ఆసక్తిని చూపించలేదు. అయితే దుబాయ్ వేదికగా బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీతో చర్చించిన తర్వాత ద్రవిడ్ తన మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. కాగా నేషనల్ క్రికెట్ అకాడమీ హెడ్‌గా ద్రవిడ్ స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్‌ను బీసీసీఐ నియమించనున్నట్లు సమాచారం.
