Rahmanullah Gurbaz Creates History in Afghanistan Cricket: శనివారం ధర్మశాల వేదికగా భారత్‌తో జరిగిన తొలి వన్డేలో అఫ్గానిస్థాన్ ఓడిపోయింది. యువ ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ (102; 51 బంతుల్లో 8×4, 8×6) మెరుపు సెంచరీ చేసినప్పటికీ అఫ్గాన్‌కు ఓటమి తప్పలేదు. వర్షం కారణంగా మ్యాచ్‌ను 25 ఓవర్లకు కుదించారు. ముందుగా బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ 24.5 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌటైంది. ఛేదనలో భారత్ 22.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయం అందుకుంది. జట్టు ఓడిపోయినప్పటికీ గుర్బాజ్ అఫ్గానిస్థాన్ క్రికెట్ చరిత్రలో పలు అరుదైన రికార్డులను ఖాతాలో వేసుకున్నాడు.
అఫ్గాన్ క్రికెట్‌లో కొత్త మైలురాయి:
రహ్మనుల్లా గుర్బాజ్ అంతర్జాతీయ క్రికెట్‌లో 10 సెంచరీలు పూర్తి చేసిన తొలి అఫ్గానిస్థాన్ బ్యాటర్‌గా నిలిచాడు. అలాగే అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన అఫ్గాన్ ఆటగాళ్ల జాబితాలో ఇబ్రహీం జద్రాన్‌ను అధిగమించి నాలుగో స్థానానికి చేరుకున్నాడు. ఇప్పటివరకు 143 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన గుర్బాజ్.. 146 ఇన్నింగ్స్‌లలో 4403 పరుగులు చేశాడు. ఇందులో 10 సెంచరీలు, 20 అర్ధసెంచరీలు ఉన్నాయి. అతని అత్యధిక వ్యక్తిగత స్కోరు 151. మరోవైపు ఇబ్రహీం జద్రాన్ 113 మ్యాచ్‌ల్లో 4337 పరుగులు చేశాడు.
ఫాస్టెస్ట్ వన్డే సెంచరీ:
వర్షం కారణంగా 25 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్ 26 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన గుర్బాజ్ భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 48 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి అఫ్గానిస్థాన్ తరఫున వన్డేల్లో అత్యంత వేగవంతమైన సెంచరీ నమోదు చేశాడు. హష్మతుల్లా షాహిదీతో కలిసి నాలుగో వికెట్‌కు 116 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. గుర్బాజ్ ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. అతని పోరాటంతో అఫ్గానిస్థాన్ 24.5 ఓవర్లలో 194 పరుగులు చేయగలిగింది.
అరుదైన సిక్సర్ల రికార్డు:
ఈ మ్యాచ్‌లో సిక్సర్ల వర్షం కురిపించిన గుర్బాజ్.. అంతర్జాతీయ క్రికెట్‌లో 200 సిక్సర్లు పూర్తి చేసిన రెండో అఫ్గాన్ బ్యాటర్‌గా నిలిచాడు. ప్రస్తుతం అతని ఖాతాలో 204 సిక్సర్లు ఉన్నాయి. ఈ జాబితాలో 246 సిక్సర్లతో మహ్మద్ నబీ అగ్రస్థానంలో ఉన్నాడు. అఫ్గానిస్థాన్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగానూ నబీ కొనసాగుతున్నాడు. అతడు 332 మ్యాచ్‌ల్లో 6,252 పరుగులు బాదాడు. జట్టు ఓడిపోయినా.. తన మెరుపు సెంచరీతో గుర్బాజ్ అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు.

