ఫ్రెంచ్ ఓపెన్‌లో స్పెయిన్ ఆటగాడు రాఫెల్ నాదల్ మరోసారి తన సత్తా చాటాడు. ఆదివారం నాడు ఏకపక్షంగా సాగిల్ ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్‌లో నార్వే ఆటగాడు కాస్పర్ రూడ్‌ను 6-3, 6-3, 6-0 స్కోరు తేడాతో నాదల్ సులభంగా ఓడించాడు. తొలి రెండు సెట్లలో ఓ మోస్తరు ప్రతిఘటన కనబర్చిన రూడ్ చివరి సెట్‌లో మాత్రం నాదల్ దూకుడుకు తలవంచాడు. దీంతో రికార్డు స్థాయిలో 14వ సారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను నాదల్ కైవసం చేసుకున్నాడు. ఓవరాల్‌గా ఇది నాదల్‌కు 22వ గ్రాండ్ స్లామ్ టైటిల్ కావడం విశేషం. ప్రపంచ టెన్నిస్ చరిత్రలో ఇన్ని గ్రాండ్ స్లామ్ టైటిళ్లు నెగ్గిన ఆటగాడు నాదల్ ఒక్కడే. ఈ జాబితాలో రోజర్ ఫెదరర్, నొవాక్ జకోవిచ్ చెరో 20 గ్రాండ్ స్లామ్ టైటిళ్లతో రెండో స్థానంలో ఉన్నారు.
మరోవైపు ఫ్రెంచ్ ఓపెన్ మహిళల డబుల్స్ఫైనల్స్లో ఫ్రాన్స్‌కు చెందిన కరోలీన్ గార్సియా-క్రిస్టీనా మ్లడానొవిచ్జోడీ విజేతగా నిలిచింది. అమెరికాకు చెందిన జెస్సికా పెగులా -కోకో గాఫ్ జోడీతో పోరాడిన గార్సియా-క్రిస్టీనా ద్వయం 2-6, 6-3, 6-2 తేడాతో గెలుపొందింది. మరోవైపు మహిళల సింగిల్స్ కేటగిరిలో శనివారం జరిగిన ఫైనల్స్‌లో ప్రపంచ నెం.1గా పోలెండ్ క్రీడాకారిణి స్వైటెక్ మరోసారి విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.
