NTV Telugu Site icon

జోకోవిచ్ దుర‌దృష్టమే నాద‌ల్ అదృష్ట‌మా…..

రాఫెల్ నాదల్ ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్‌లోకి అడుగుపెట్టాడు. 21వ గ్రాండ్ స్లామ్ టైటిల్ అడుగు దూరంలో నిలిచాడు. మ‌రొక్క మ్యాచ్ గెలిస్తే చాలు ఓపెన్ టెన్నిస్ చ‌రిత్ర‌ను తిర‌గ‌రాస్తాడు.

35 ఏళ్ల స్పెయిన్ బుల్ శుక్ర‌వారం జ‌రిగిన సెమీఫైన‌ల్స్‌లో 7వ ర్యాంకు ఆట‌గాడు మాటియో బెర్రెటిన్‌ను 6-3, 6-2, 3-6, 6-3తో ఓడించి ఫైన‌ల్ బెర్త్ ఖాయం చేసుకున్నాడు.

ఈ విజ‌యంతో నాదల్ త‌న కెరీర్‌లో 29వ సారి గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ ఫైన‌ల్‌కు చేరుకున్నారు. ఆదివారం జరిగే ఫైనల్‌లో యూఎస్‌ ఓపెన్ ఛాంపియన్ వ‌ర‌ల్డ్ నెంబ‌ర్ 2 డేనిల్ మెద్వెదేవ్, ఫ్రెంచ్ ఓపెన్ రన్నరప్ వ‌రల్డ్ నెంబ‌ర్ 4 స్టెఫానోస్ సిట్సిపాస్ లో ఎవ‌రో ఒక‌రితో ఫైన‌ల్లో ఆడ‌తాడు.

ఇప్ప‌టి వ‌ర‌కు నాలుగు సార్లు ఆస్ట్రేలియ‌న్ ఓపెన్ ఫైన‌ల్‌కు చేరిన నాద‌ల్ ఒక్క‌సారి మాత్ర‌మే విజేత‌గా నిలిచాడు. కాబ‌ట్టి ఆదివారం నాటి మ్యాచ్ కోసం యావత్ ప్ర‌పంచం ఎదురుచూస్తోంది. జొకోవిచ్‌, ఫ‌డ‌ర‌ర్ లేని ఈ మేజ‌ర్ టోర్నీ కొంత క‌ళ త‌ప్పినా.. నాడ‌ల్ ఫైనల్‌కు చేరుకోవడం ఆ లోటును భ‌ర్తీ చేసింది. మ‌రోసారి ఇక్క‌డ ఫైన‌ల్ చేర‌టానికి చాలా క‌ష్ట‌ప‌డ్డాన‌ని తాజా ఇంట‌ర్వ్యూలో నాద‌ల్ నిజాయితీగా చెప్పాడు.

జి.ఓ.ఎ.టి (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్‌) స్టేట‌స్‌ని తాను ప‌ట్టించుకోన‌ని నాద‌ల్ ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పాడు. ఐతే తనతో 20 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ రికార్డును పంచుకుంటున్న తన చిరకాల ప్రత్యర్థులు ఫెడరర్, జొకోవిచ్‌లను అధిగమించాలని ప్రయత్నిస్తున్నట్లు చెప్పాడు. తాజా గెలుపుతో ఆయ‌న ప్ర‌య‌త్నాలు దాదాపు ఫ‌లించిన‌ట్టే క‌నిప‌స్తోంది.

ఆస్ట్రేలియ‌న్ ఓపెన్ ఫైన‌ల్‌లో నాడ‌ల్ విజ‌యం సాధిస్తే అత్య‌ధిక మేజ‌ర్ టైటిల్స్‌తో పాటు , ప్రతి గ్రాండ స్లామ్ ని రెండేసి సార్లు గెలిచిన జొకోవిచ్ స‌ర‌స‌న చేర‌తాడు. జకో క‌రోనా వ్యాక్సిన్ తీసుకోక‌పోవ‌టంతో దేశంలోకి అనుమ‌తించలేదు. ఇప్ప‌టికే ఆయ‌న తొమ్మిది సార్లు ఆస్ట్రేలియ‌న్ ఓపెన్ విజేత‌గా నిలిచాడు. కాబ‌ట్టి అత‌ను బ‌రిలో ఉండి ఉంటే కచ్చితంగా టైటిల్ ఫేవ‌రెట్ల‌లో ఒక‌రుగా ఉండే వాడు. కాని దుర‌దృష్ట వ‌శాత్తు ఈ టోర్నీలో ఆడే అవకాశం కోల్పోయాడు. అదే నాద‌ల్ కు అదృష్టంగా మారింది అనిపిస్తోంది.

నిజం చెప్పాలంటే నాద‌ల్ చాలా దుర‌దృష్ట‌వంతుడు. గాయాల బారినప‌డి అనేక టోర్నీల‌కు దూరమ‌య్యాడు. కొన్నిసార్లు టోర్నీ మ‌ధ్య నుంచి నిష్ర్క‌మించాల్సి వ‌చ్చింది . 2019లో జోకోవిచ్‌తో, 2017లో రోజ‌ర్ ఫెడ‌ర‌ర్‌తో , 2014లో వావ్రింకాతో ఆస్ర్టేలియ‌న్ ఓపెన్‌ ఫైనల్స్ ఆడాడు. కానీ మూడు సార్లు టైటిల్‌కు ద‌గ్గ‌ర‌గా వ‌చ్చినా ద‌క్కించుకోలేక‌పోయాడు. 2009లో ఫెడ‌ర‌ర్‌పై గెలిచి విజేత‌గా నిలిచాడు. మ‌రుస‌టి సంవ‌త్స‌రం యూఎస్ ఓపెన్ టైటిల్‌తో కెరీర్ గ్రాండ్‌స్లామ్ సాధించాడు.

ఓపెన్ ఎరాలో 500 హార్డ్ కోర్ట్ మ్యాచ్‌లు గెలిచిన నాల్గవ ఆటగాడిగా ఈ స్పెయిన్ బుల్లోడు ఫెడరర్, జొకోవిచ్, ఆండ్రీ అగస్సీ స‌ర‌స‌న నిలిచాడు. ఓపెన్ ఎరాలో హార్డ్‌కోర్ట్ , రెండింటిలోనూ 400 లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్‌లు గెలిచిన ఏకైక ఆట‌గాడిగా నాదల్ ఘ‌న‌త సాధించాడు.

2021 సంవత్సరం ముగిసే సమయానికి జోకోవిచ్‌, రోజర్ ఫెదరర్, రాఫెల్ నాదల్, నోవాక్ జకోవిచ్ ముగ్గురూ 20 గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిల్స్‌తో స‌మ ఉజ్జీలుగా ఉన్నారు. ఈ ప‌రిస్థితి గ‌తంలో ఎన్న‌డూ లేదు. దాంతో ఎవరు ముందు 21వ గ్రాండ్‌స్లామ్ సాధిస్తార‌నే చ‌ర్చ మొదలైంది.

ఈ సంద‌ర్బంలో ముందు పెడ‌ర‌ర్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఈ ఆల్ టైమ్ గ్రేటెస్ట్ ప్లేయ‌ర్ ఆడుతుంటే యావ‌త్ ప్రపంచం ఊపిరి బిగ‌బ‌ట్టి చూస్తుంది. ప్ర‌స్తుతం ఈ టెన్నిస్ మాస్ర్టో 17వ ర్యాంకు ఆట‌గాడు. ఇటీవ‌ల జ‌రిగ‌న‌ మోకాలి శ‌స్త్ర‌చికిత్స నుంచి కోలుకుంటున్నాడు. అందుకే ఈ టోర్నీలో లేడు.

రోజర్ ఫెడరర్ ఏటీపీ ర్యాంకింగ్స్‌లో మొత్తం 310 వారాలపాటు ప్రపంచ నం. 1గా ఉన్నాడు. రికార్డు స్థాయిలో వ‌ర‌స‌గా 237 వారాలు నెంబ‌ర్ వ‌న్ల ర్యాంకులో కొన‌సాగాడు. ఆరు ఏటీపీ ఫైన‌ల్స్‌తో పాటు 103 ఏటీపీ సింగిల్స్ టైటిళ్లు గెలుచుకుని జిమ్మీ కానర్స్ తర్వాత రెండ‌వ ఆట‌గాడ‌య్యాడు.

వాస్త‌వానికి రోజ‌ర్ ఫెడ‌ర‌ర్ ఎవ‌రూ అందుకోలేని స్థాయిలో మేజ‌ర్ టైటిల్స్ సాధిస్తాడని భావించారు. కానీ గ‌డ‌చిన ప‌దేళ్ల‌లో కేవ‌లం నాలుగు గ్రాండ్‌స్లామ్ లు మాత్రమే ఆయ‌న ఖాతాలో ప‌డ్డాయి. 2012 నాటికే అతడు 16 మేజ‌ర్ టైటిల్స్ సాధించాడు. ఇదే స‌మయంలో నాడ‌ల్ 10, జోకోవిచ్ 15 టైటిల్స్ సాధించారు.

ఫెడ‌ర‌ర్ త‌న 20వ గ్రాండ్ శ్లామ్ ఓపెన్‌ను 2018 లో గెలుచుకున్నాడు. అప్ప‌టికి నాడ‌ల్ 2, జోకోవిచ్ 4 గ్రాండ్ శ్లామ్ లు వెన‌క‌బ‌డి ఉన్నారు. ఈ మూడేళ్ల‌లో నాడ‌ల్ 3, జోకోవిచ్ ఐదు మేజ‌ర్ టైటిల్స్ సాధించారు. కానీ ఫెడ‌ర‌ర్ ఒక్కటీ గెల‌వ‌లేక‌పోయాడు. జోకోవిచ్ దూకుడు చూసి ఫెడ‌ర‌ర్ తో పాటు నాద‌ల్ ప‌ని కూడా అయిపోయింద‌నే అనుకున్నారు. కానీ అనూహ్యంగా విజృంభించి ఈ ఆస్ట్రేలియ‌న్ ఓపెన్ టైటిల్ పోరుకు సిద్ధ‌మ‌య్యాడు.

రాఫెల్ నాడ‌ల్ ప్ర‌స్తుతం ఐద‌వ ర్యాంకు ఆట‌గాడు. క్లే కోర్టుల‌కు మ‌కుటం లేని మ‌హారాజు. అందుకే ఆయ‌న‌ను కింగ్ ఆఫ్ క్లే అంటారు. 209 వారాల పాటు వ‌ర‌ల్డ్ నెంబ‌ర్ వ‌న్ ఆట‌గాడిగా కొన‌సాగాడు. నాడ‌ల్ సాధించిన 20 గ్రాండ్ స్లామ్ టైటిళ్ల‌లో 13 ఫ్రెంచ్ ఓపెన్ ఉండ‌టం క్లే కోర్టుల మీద ఆయ‌న ప‌ట్టుకు నిద‌ర్శ‌నం. అత‌డు గెలిచిన 88 ఏటీపీ సింగిల్స్ టైటిళ్ల‌లో 62 క్లే కోర్టుల మీద గెలిచిన‌వే. ఓపెన్ శ‌కంలో క్లే కోర్టుల మీద వ‌ర‌స‌గా 81 విజ‌యాలు సాధించిన ఘ‌నుడు నాడ‌ల్ ఒక్క‌డే.

ఇక ప్ర‌స్తుత నెంబ‌ర్ వ‌న్ ఆట‌గాడు జోకోవిచ్ విష‌యానికి వ‌స్తే ఇటీవ‌ల కొన్నేళ్లుగా విజృంభించి టైటిల్స్ సాధిస్తున్నాడు. గ‌త రెండేళ్ల‌లో ఆరు మేజ‌ర్స్ సాధించి మంచి ఊపు మీద ఉన్నాడు. ఓపెన్ శ‌కంలో రెండు సార్లు కెరీర్ గ్రాండ్ శ్లామ్ సాధించిన ఏకైక ఆట‌గాడు. 351 వారాల పాటు నెంబ‌ర్‌వ‌న్‌గా కొన‌సాగి రికార్డు సృష్టించాడు. ఇంకా ఆ టాప్ స్లాట్‌లో కొన‌సాగుతూనే ఉన్నాడు.

ఫెడ‌ర‌ర్‌, నాడ‌ల్ క‌న్నా ముందు జోకోవిచ్ 21వ గ్రాండ్‌శ్లామ్ సాధిస్తార‌న్న‌ది అంద‌రి అంచ‌నా. కానీ ఇప్పుడు ఫోక‌స్ నాడ‌ల్ మీద‌కు వెళ్లింది. ఎంద‌కంటే, ఆస్ట్రేలియ‌న్ ఓపెన్ త‌రువాత జ‌రిగేది ఫ్రెంచ్ ఓపెన్. అంటే ఆ టోర్నీకి నాడ‌ల్ పేటెంట్ ప్లేయ‌ర్‌. ఒక వేళ ఇక్క‌డ టైటిల్ మిస్సయినా ఫ్రెంచ్ ఓపెన్‌తో 21వ గ్రాండ్ స్లామ్ అందుకునే అవ‌కాశాలు పుష్కలం. ఇక ఇప్పుడూ , అప్పుడూ గెలిస్తే అత‌డిని అందుకోవ‌టానికి జోకోవిచ్ కు మ‌రింత స‌మ‌యం ప‌డుతుంది. ఐతే, ఆదివారం ఫైన‌ల్‌లో నాడ‌ల్ ఎలా ఆడ‌తాడో చూడాలి మ‌రి!!