PV Sindhu: విరాట్ కోహ్లీ చెప్పిన ఒక్క మాటే.. నా జీవితాన్ని పూర్తిగా మార్చింది!

  • జపాన్ ఓపెన్ టైటిల్‌ కైవసం చేసుకున్న పీవీ సింధు
  • కఠిన శిక్షణ, క్రమశిక్షణతో టైటిల్ అందుకున్న సింధు
  • నా ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేసింది
Pv Sindhu, Virat Kohli

Pv Sindhu, Virat Kohli

భారత స్టార్ షట్లర్, తెలుగుగ తేజం పీవీ సింధు చాలా కాలం తర్వాత మళ్లీ అద్భుత ఫామ్‌ను అందుకుని జపాన్ ఓపెన్ 2026 టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ విజయంతో జపాన్ ఓపెన్ గెలిచిన తొలి భారతీయ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. రెండేళ్లుగా ఒక్క మేజర్ టైటిల్ కూడా సాధించలేక తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్న సింధు.. కఠిన శిక్షణ, క్రమశిక్షణతో టైటిల్ అందుకుంది. తాజాగా సింధు మాట్లాడుతూ.. టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇచ్చిన ఒక విలువైన సలహా తన ఆటలో కొత్త మార్పుకు కారణమైందని వెల్లడించింది.

ఇటీవల తన ఆటలో నిలకడ కోల్పోయి సరైన ఫలితాలు సాధించలేకపోతున్న సమయంలో తాను విరాట్ కోహ్లీని సంప్రదించినట్లు పీవీ సింధు తెలిపింది. చాలా కాలం సెంచరీ చేయలేక ఇబ్బంది పడిన అనంతరం మళ్లీ అద్భుత ఫామ్‌లోకి ఎలా వచ్చారనే విషయాన్ని కోహ్లీని అడిగినట్లు చెప్పింది. దానికి కింగ్ ఎంతో ఓపికతో సమాధానం ఇచ్చాడని వెల్లడించింది. ‘పరుగులు చేయడంలో ఉండే ఆనందాన్ని మళ్లీ ఆస్వాదించడం మొదలుపెట్టాను. ఫలితాల గురించి ఎక్కువగా ఆలోచించకుండా ఆటను ఎంజాయ్ చేయడంపైనే దృష్టి పెట్టాను’ అని కోహ్లీ తనకు చెప్పినట్లు సింధు పేర్కొంది.

‘విరాట్ కోహ్లీ చెప్పిన ఒక్క మాట నా ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేసింది. విజయాలు, ఓటముల గురించి కాకుండా.. ఆటను ప్రేమిస్తూ, ప్రతి మ్యాచ్‌ను ఆస్వాదిస్తూ ఆడాలని నిర్ణయించుకున్నా. అదే నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచి మళ్లీ విజయాల బాట పట్టేలా చేసింది’ అని పీవీ సింధు తెలిపింది. జపాన్ ఓపెన్ 2026 టైటిల్ సాధించడంలో కఠినమైన శిక్షణ, ఫిట్‌నెస్, ఆహార నియమాలు ఎంత కీలకమో.. అంతే స్థాయిలో మానసిక ధైర్యం కూడా ముఖ్యపాత్ర పోషించిందని సింధు పేర్కొంది. ముఖ్యంగా కోహ్లీ చెప్పిన ఆ సలహా తనకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చి.. మళ్లీ అత్యున్నత స్థాయిలో రాణించడానికి ప్రేరణగా నిలిచిందని చెప్పింది. ఈ విజయంతో సింధు రెండేళ్ల టైటిల్ నిరీక్షణకు తెరదించడమే కాకుండా.. భారత బ్యాడ్మింటన్ చరిత్రలో మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది.